Share News

ఈ నెల 30 వరకు భారీ వర్షాలు

ABN , Publish Date - Jun 25 , 2026 | 04:31 AM

రాష్ట్రంలో ఈ నెల 30 వరకు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో....

ఈ నెల 30 వరకు భారీ వర్షాలు

  • పలు జిల్లాలకు యెల్లో అలెర్ట్‌.. ములుగు జిల్లా మల్లంపల్లిలో 10 సెంటీమీటర్ల వాన

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): రాష్ట్రంలో ఈ నెల 30 వరకు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ జిల్లాలకు యెల్లో అలెర్ట్‌ జారీ చేసింది. అలాగే శుక్రవారం యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడ్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా ములుగు జిల్లా మల్లంపల్లిలో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌ నగరంలో బుధవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి. బాచుపల్లి, నిజాంపేట ప్రాంతాల్లో అరగంట కురిసిన వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. మరో మూడు రోజులు గ్రేటర్‌ పరిధిలో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుందని పేర్కొంది. కాగా పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో అత్యధికంగా 42.2 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. అలాగే కాల్వశ్రీరాంపూర్‌ మండలంలో 40.9 మిల్లీమీటర్లు, ముత్తారం మండలంలో 20 మిల్లీమీటర్లు, అంతర్గాం మండలంలో 19.7 మిల్లీమీటర్లు, రామగుండం మండలంలో 13.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలంలో 19.6 మిల్లీమీటర్లు, వెల్గటూరులో 11.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షం వల్ల జిల్లాలోని ధర్మపురి మున్సిపాలిటీలోని హనుమాన్‌ వీధిలో పెంకుటిల్లు పైకప్పు కూలింది. కామారెడ్డి జిల్లాలో బుధవారం అక్కడక్కడ మోస్తరు వర్షం కురిసింది. పలు మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి. నిర్మల్‌ జిల్లాలో పలు మండలాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బుధవారం పలుచోట్ల చెదురుమదురు జల్లులు కురిశాయి.

వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నా..రోగిని తెప్ప సహాయంతో దాటించిన గ్రామస్థులు

రెండు రోజులుగా కురిసిన భారీ వర్షానికి ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం బానాజీబంధం - ఎలిశెట్టిపల్లి గ్రామాల మధ్య ఉన్న జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఎలిశెట్టిపల్లి గ్రామానికి చెందిన యువకుడు రాకేష్‌ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అతడి ఆరోగ్యం క్షీణిస్తుండగా పలువురు గ్రామస్థులు తెప్ప సహాయంతో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటించారు. అక్కడి నుంచి ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి ఆటోలో తరలించారు. వాగుపై వంతెన నిర్మించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నా పట్టించుకోవడంలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Jun 25 , 2026 | 04:31 AM