గాలివాన బీభత్సం
ABN , Publish Date - Apr 24 , 2026 | 03:49 AM
రాష్ట్రంలో పగలంతా మండే ఎండ ఠారెత్తుస్తుంటే.. సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. గురువారం పలు జిల్లాల్లో ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటగా.. వడదెబ్బకు గురై ముగ్గురు మృతిచెందారు.
సిరిసిల్లలో గోడ కూలి ఏడుగురికి గాయాలు
ఎగిరి రోడ్లపై పడిన రేకులు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో దెబ్బతిన్న పంటలు
ఠారెత్తించే ఎండ.. సాయంత్రం గాలివాన
బాన్సువాడ మండలం కొల్లూర్‌లో 43.8 డిగ్రీలు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
రాష్ట్రంలో పగలంతా మండే ఎండ ఠారెత్తుస్తుంటే.. సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. గురువారం పలు జిల్లాల్లో ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటగా.. వడదెబ్బకు గురై ముగ్గురు మృతిచెందారు. సాయంత్రం వివిధ ప్రాంతాల్లో ఈదురుగాలులు భయభ్రాంతుల్ని చేశా యి. సిరిసిల్లలో గాలుల ధాటికి చెట్లు విరిగిపడ్డాయి. బైపాస్ లో షెడ్ల రేకులు ఎగిరి రోడ్డుపై పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్ల పక్కన చిన్న దుకాణాలు దెబ్బతిన్నాయి. మార్కెట్ ఏరియాలో ఓ భవనం పిట్టగోడ కూలి పక్కన ఉన్న రేకుల ఇంటిపై పడడంతో ఆ ఇంట్లోని ఏడుగురు గాయపడ్డారు. వారిలో చిన్నారి సిద్దికా, సుల్తానా పరిస్థితి విషమంగా ఉంది. మరోచోట గోడకూలడంతో ఇంట్లో వస్తువులన్నీ దెబ్బతిన్నాయి. వర్షానికి సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి, ఎల్లారెడ్డిపేట, బొప్పాపూర్ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. ఇల్లంతకుంట మండలం రామోజీపేటలో భారీ గాలులకు చెట్టు విరిగి ఇంటిపై పడింది. రంగారెడ్డి జిల్లాలో ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. పలుచోట్ల చెట్లకొమ్మలు విరిగిపడ్డాయి. చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోని షాబాద్ మండలంలో కూరగాయలు, పూలు, పండ్ల తోటలు దెబ్బతిన్నాయి. పలుచోట్ల 43 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లాలో బాన్సువాడ మండలం కొల్లూర్‌లో 43.8, నిజామాబాద్ జిల్లా మోస్రా, మంచిప్ప, మచ్చర్లలో 43.7, పోతంగల్‌లో 43.6 డిగ్రీలు నమోదైంది.
వడదెబ్బకు ముగ్గురి మృతి
రాష్ట్రంలో ఎండ తీవ్రతకు వడదెబ్బ తగిలి ముగ్గురు మృతిచెందారు. పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన శ్రీరామ ఫొటో స్టూడియో యాజమాని గంధం నగేష్ (55), కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం గానుగపాడులో పణితి వెంకటేశ్వర్లు (57), ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గుట్టల గంగారంలో పశువుల కాపరి నల్లబోయిన పాపయ్య (55) వడదెబ్బకు గురై మృతిచెందాడు.
పిడుగుపాటుకు ధాన్యం కుప్పపైనే రైతు మృతి
ఓ రైతు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యమంతా ఒకచోట చేర్చి, వర్షానికి తడవకుండా టార్పాలిన్ కప్పుతుం డగా పిడుగుపడి ధాన్యం కుప్పపైనే ప్రాణాలొదిలాడు. మెదక్ జిల్లా హవేలిఘనపురం మండలం బూర్గుపల్లికి చెందిన చింతల శ్రీనివాస్(36) విషాదాంతమిది. రెండు రోజులుగా అక్కడక్కడ ఈదురుగాలులతో పాటు వర్షాలు పడుతుండడంతో ధాన్యాన్ని ఒకచోట చేర్చి టార్పాలిన్ కప్పడానికి పూనుకుంటున్న క్రమంలో ఈ దుర్ఘటన జరిగింది.