నేడూ, రేపు భగభగలే
ABN , Publish Date - Jun 20 , 2026 | 04:28 AM
రాష్ట్రంలో ఎండల తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 24 జిల్లాల్లో 40-43 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
తర్వాత ఎండలు 2-3 డిగ్రీలు తగ్గొచ్చు
ఈ రెండు రోజులు వడగాలులు వీస్తాయి
హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా
నేడు 8 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ
శుక్రవారం 24 జిల్లాల్లో 40-43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎండల తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 24 జిల్లాల్లో 40-43 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరులో అత్యధికంగా 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. శనివారం 8 జిల్లాల్లో తీవ్ర ఎండలు కాసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాలకు ఎండ తీవ్రతకు సంబంధించి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో శనివారం 41-44 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని హెచ్చరించింది. శని, ఆదివారాల్లో పలు జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. రాబోయే రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని తెలిపింది. ఆ తర్వాత మూడు రోజులు ఉష్ణోగ్రతలు క్రమంగా 2-3 డిగ్రీల మేర తగ్గుతాయని అంచనా వేసింది. హైదరాబాద్‌లోనూ సాధారణం కంటే 4డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. గతేడాది జూన్ మూడో వారంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో సగటున 35-36 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయితే.. ఈ ఏడాది 40-41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం నిజాంపేట బాచుపల్లిలో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇదిలా ఉండగా, శుక్రవారం, నల్గొండ జిల్లా తిరుమలగిరిలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉండటంతో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని బేగంపేట వాతావరణశాఖ అధికారి శ్రావణి తెలిపారు. మరో మూడు రోజుల పాటు ఇదే తరహా వాతావరణం కొనసాగుతుందన్నారు. తర్వాత 4-5 రోజుల్లో తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు నైరుతి విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు.