మెండోర @ 46
ABN , Publish Date - May 03 , 2026 | 04:30 AM
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పగటి పూట వాతావరణం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. నిజామాబాద్ జిల్లా మెండోరలో గతంలో ఎన్నడూ లేని విధంగా 46డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది..
నిప్పుల కొలిమిలా నిజామాబాద్ జిల్లా
పలు జిల్లాల్లో 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు
వడదెబ్బతో నలుగురి మృతి
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పగటి పూట వాతావరణం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. నిజామాబాద్ జిల్లా మెండోరలో గతంలో ఎన్నడూ లేని విధంగా 46డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్, సిద్దిపేట జిల్లాల్లో 45.9 డిగ్రీలు, పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లో 45.8, పెద్దపల్లి మండలం భోజన్నపేటలో 45.7, ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలో 45.7, జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేటలో 45.6, నిజామాబాద్‌జిల్లా బాన్సువాడ మండలం కొల్లుర్‌లో 45.6, సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో 45.5, బిచ్కుంద మండలం పుల్కల్‌లో 45.5, రామారెడ్డిలో 45.4, బీర్కూర్‌లో 45.3, బీబీపేటలో 45.2, పాల్వంచ మండలం ఎల్పుగొండలో 45.1, పెద్దపల్లి మండలం పాల్తెంలో 45.2, రామగిరి మండలం కల్వచర్లలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లోనూ భానుడి భగ..భగలతో నగరవాసులు అల్లాడిపోతున్నారు. అంబర్‌పేట, ముషీరాబాద్‌లో అత్యధికంగా 42.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో వడదెబ్బతో నలుగురు మృతి చెందారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన తేజావతు చాప్లి(75) రెండు రోజుల క్రితం వడదెబ్బకు గురి కాగా.. శనివారం తెల్లవారుజామున మృతిచెందింది. కొత్తగూడేకి చెందిన రిటైర్డ్ ఉద్యోగి వడ్డెపల్లి శంకర్ (65) వడదెబ్బ కారణంగా అస్వస్థతకు గురై మరణించాడు. మహబూబాబాద్ జిల్లా కురవికి చెందిన వెంకన్న(53).. పశువులను కాస్తున్న సమయంలో స్పృహతప్పి కిందపడిపోయాడు. ఆస్పత్రికి తరలించే సరికే మృతి చెందాడు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం మారేడుపల్లికి చెందిన జాగటి రాధ(52).. కుమారుడి పెళ్లి పనుల్లో ఉండగా వడదెబ్బకు గురైంది.. బంధువులు కరీంనగర్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందింది. కాగా, ఓ వైపు ఎండలు మండుతున్న క్రమంలో కొత్తగూడెం జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. పలు మండలాల్లో ధాన్యం, మొక్కజొన్న తడిసిపోయింది. భద్రాద్రి జిల్లాలోని గానుగపాడుకు చెందిన కోండ్రు వినోద్(27) తన స్నేహితులైన జక్కుల రాజశేఖర్, తీట్ల అశోక్, పణితి కాంతారావుతో కలిసి మొక్కజొన్న చేను వద్దకు వెళ్లగా... వారిపై పిడిగు పడింది. వారిలో ముగ్గురు ప్రాణాపాయం నుంచి బయటపడగా.. వినోద్ మృతి చెందాడు. అలాగే, బూర్గంపాడు మండలం ఇరవెండికి చెందిన రైతు గోపయ్య(50).. తన పొలంలో ఉండగా పిడుగు పడడంతో మృతి చెందాడు.
నాలుగు రోజుల తర్వాతే తగ్గుదల
రాష్ట్రంలో వచ్చే రెండు రోజుల పాటు గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు ఉండబోదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నాలుగు రోజుల తర్వాత 2-4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే మూడు రోజుల పాటు ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్లగొండ, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.