ఠా..రెత్తించిన ఎండ
ABN , Publish Date - Apr 15 , 2026 | 04:36 AM
రాష్ట్రంలో ఎండలు తీవ్ర రూపం దాల్చాయి రాష్ట్రంలోని 23 జిల్లాల్లో మంగళవారం 42 డిగ్రీలకు పైబడి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం...
రాష్ట్రంలో నిప్పులు చెరిగిన సూరీడు
ఎండ వేడి, వడగాల్పులకు విలవిల్లాడిన జనం
23 జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు
నేడు, రేపు కొనసాగనున్న వడగాలుల ప్రభావం
రాబోయే మూడు రోజుల్లో రెండు నుంచి మూడు డిగ్రీల దాకా పెరగనున్న ఉష్ణోగ్రతలు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
రాష్ట్రంలో ఎండలు తీవ్ర రూపం దాల్చాయి రాష్ట్రంలోని 23 జిల్లాల్లో మంగళవారం 42 డిగ్రీలకు పైబడి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం మచ్చర్లలో మంగళవారం అత్యధికంగా 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్ జిల్లా భీంగల్‌లో 43.0, మోస్రాలో 42.9, నిజామాబాద్‌లో 42.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లా భిక్కనూరులో 42.9, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో 42.8, ఆదిలాబాద్ అర్బన్‌లో 42.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెదక్ జిల్లా చేగుంట, సిద్దిపేట జిల్లా తుక్కాపూర్, శనిగరంలో 42.7డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డిలో 42.8, నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి, కల్వకుర్తి మండలాల్లో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లోని అంబర్‌పేట, సికింద్రాబాద్, ముషీరాబాద్ ప్రాంతాల్లో 40.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక, రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో బుధ, గురువారాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని, రానున్న మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల మేర పెరిగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక, ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామానికి చెందిన ముత్యాల సత్యవతి (55) వడదెబ్బతో మంగళవారం మరణించారు.
పెరిగిన విద్యుత్ డిమాండ్
ఎండలు, వడగాలుల దెబ్బకు రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ కూడా పెరిగిపోయింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పరిధిలో సోమవారం 4,387 మెగావాట్ల డిమాండ్ నమోదవ్వగా, మంగళవారం మధ్యాహ్నం 4,447 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఇప్పటివరకు గ్రేటర్‌లో నమోదైన అత్యధిక డిమాండ్ ఇదేనని అధికారులు తెలిపారు.