నిప్పుల కొలిమిలా రాష్ట్రం
ABN , Publish Date - May 06 , 2026 | 06:51 AM
సూర్యుడి ప్రతాపంతో పగటి వేళ నిప్పుల కుంపటిలా మారుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుతున్నాయి. ఎండల తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
రికార్డుస్థాయిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు
కొల్లూర్‌లో 45.6,మెండోరలో 45.4 డిగ్రీలు
వడదెబ్బకు ముగ్గురి మృతి
ఆసిఫాబాద్‌లో గాలివాన బీభత్సం
ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్: సూర్యుడి ప్రతాపంతో పగటి వేళ నిప్పుల కుంపటిలా మారుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుతున్నాయి. ఎండల తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గడపదాటి బయటకు రావడానికి జంకుతున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొల్లుర్‌లో మంగళవారం 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బిచ్కుందలో 45.5, నిజామాబాద్ జిల్లా మెండోరలో 45.4, ఆర్మూర్‌లో 45, జగిత్యాల జిల్లా కొల్వాయిలో 45.3, సిద్దిపేట జిల్లా తుక్కాపూర్‌లో 44.6, గండిపల్లిలో 44.4, మెదక్ జిల్లా కాగజ్‌మద్దూర్‌లో 43.8, నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరులో 43.3 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. కాగా సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం చౌకన్‌పల్లిలో మర్రి లక్ష్మణ్, శారద దంపతులు సోమవారం ఉపాధిహామీ పనుల్లో పాల్గొన్నారు. అక్కడ నీడ వసతి లేకపోవడంతో వారి కుమార్తె శైలజ(6) పనులు జరిగినంత సేపు ఎండలోనే ఆడుకుంది. తీవ్ర నీరసానికి గురైన బాలిక మంగళవారం తెల్లవారుజామున మృతి చెందింది. ఆదిలాబాద్ జిల్లా సోనాల మండలం లేండిగూడకి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని మడావి శ్రీదేవి(14), జగిత్యాల జిల్లా మల్యాల మండలం పోతారం గ్రామానికి చెందిన మునుగూరి లస్మవ్వ(74) వడదెబ్బకు మృతి చెందారు. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో కురిసిన అకాల వర్షానికి.. టార్పాలిన్లు అందుబాటులో లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిముద్దయింది. సైదాపూర్ మండలం ఎక్లా్‌సపూర్‌లో వడగళ్ల వాన దెబ్బకు వరిపొలాలు నేలవాలాయి. ఆసిఫాబాద్ పట్టణంలో గాలివాన బీభత్సం సృష్టించింది. సందీ్‌పనగర్ ఎస్సీ కాలనీలోని ఓ ఇంటిపైకప్పు ఎగిరిపోయింది.