Share News

వడదెబ్బతో నలుగురి మృతి

ABN , Publish Date - Apr 26 , 2026 | 04:41 AM

రాష్ట్రంలో సూర్యుడి ప్రతాపం కొనసాగుతోంది. పగటి పూట ఎండలు మండిపోతుండటంతో బయటకు వెళ్లాలంటేనే జంకే పరిస్థితి నెలకొంటోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు...

వడదెబ్బతో నలుగురి మృతి

  • భానుడి ప్రతాపంతో జనం విలవిల

  • మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో 44.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు

  • రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో 44 డిగ్రీలపైనే నమోదు

  • పగలు బయట అడుగు పెట్టాలంటేనే జంకుతున్న జనం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో సూర్యుడి ప్రతాపం కొనసాగుతోంది. పగటి పూట ఎండలు మండిపోతుండటంతో బయటకు వెళ్లాలంటేనే జంకే పరిస్థితి నెలకొంటోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఎండవేడి, ఉక్కపోతలతో జనం అల్లాడుతున్నారు. వడదెబ్బకు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం మర్రిపెల్లిగూడెం గ్రామానికి చెందిన సాదుల నరహరి (58) శనివారం వడదెబ్బతో మృతి చెందాడు. రెండు రోజుల క్రితం ఆయన విస్తారాకుల తయారీకి వాడే మోదుగ ఆకుల సేకరణ కోసం వెళ్లి అస్వస్థతకు గురయ్యాడు. శనివారం పరిస్థితి విషమించి మరణించాడు. నరహరికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. వరంగల్‌ జిల్లా గీసుగొండ మండలం రాంపురం గ్రామానికి చెందిన వృద్దురాలు ఎండీ యాకూబీ (63) వడదెబ్బతో శనివారం మృతి చెందింది. శుక్రవారం ఆమె మిర్చి తొడిమలు తీయటానికి కూలీకి వెళ్లింది. సాయంత్రం అస్వస్థతకు గురైంది. శనివారం కుటుంబసభ్యులు ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయింది. మృతురాలికి భర్త కుమార్తె, కుమారుడు ఉన్నారు. మంచిర్యాల జిల్లా తాండూర్‌ మండలం రేచిని గ్రామానికి చెందిన కొట్రంగి జయరాం (40) వడదెబ్బతో మృతి చెందాడు. సూర్యాపేట జిల్లా అర్వపల్లి గ్రామానికి చెందిన మామిడి నరసింహ(51) వడదెబ్బకు గురై శనివారం చనిపోయాడు.


మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో 44.3 డిగ్రీలు..

మంచిర్యాల జిల్లా కాసిపేట కొండాపూర్‌, చెన్నూరు మండలం కొమ్మెరలో శనివారం 44.3 డిగ్రీలు, జగిత్యాల జిల్లా మేడిపల్లి, మల్లాపూర్‌ మండలం రాఘవపేటలో 44.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోరుట్ల మండలం అయిలాపూర్‌, రాయికల్‌ మండలం అల్లీపూర్‌, ఇబ్రహీంపట్నం మండలం గోదూర్‌, బీర్‌పూర్‌ మండలం కొల్వాయి, ధర్మపురి మండలం జైన, రాయికల్‌లలో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కుమరంభీం ఆసిఫాబాద్‌లో 44.2, దహెగాం మండలం కంచవెల్లి, సిర్పూర్‌(టి) మండలాల్లో 44.1, పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌, రామగుండం మండలం మైలారం, కల్వచర్ల, పెద్దపల్లి మండలం పాల్తెంలో 44.2 డిగ్రీలు, అంతర్గాం మండలం ఆకెనపల్లిలో 44.1, సుల్తానాబాద్‌ మండలం సుగ్లాంపల్లిలో 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే నిజామాబాద్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో 44 డిగ్రీలపైనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మోర్తాడ్‌లో 44.2, మల్కాపూర్‌, కోటగిరి, మంచిప్పలలో 44.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో 42 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బాన్సువాడ మండలం కొల్లుర్‌, పాల్వంచ మండలం ఎల్పుగొండలో అత్యధికంగా 43.8, మద్నూర్‌ మండలం మేనూరులో 43.7, పిట్లం 43.5, కామారెడ్డి 43.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43.8 డిగ్రీలుగా నమోదయ్యాయి. భూపాలపల్లిలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్‌ జిల్లా శివ్వంపేటలో 43.8, సిద్దిపేట జిల్లాలోని సముద్రాల, పోతరెడ్డిపల్లిలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

పిడుగుపాటుకు యువకుడి మృతి

పిడుగుపడి నాగర్‌కర్నూలు జిల్లా బల్మూరు మండలం మైలారం గ్రామానికి చెందిన గట్టు సలేశ్వరం(19) శనివారం మృతి చెందాడు. తమ మక్క చేనులో గేదెలను కాస్తుండగా సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, గాలి దుమారం రావడంతో తాటి చెట్టు కిందకు వెళ్లాడు. అకస్మాత్తుగా పిడుగుపడటంతో సలేశ్వరం అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గేదె కూడా మృతి చెందింది.

Updated Date - Apr 26 , 2026 | 04:41 AM