మండే ఎండలు!
ABN , Publish Date - Apr 14 , 2026 | 04:38 AM
రోహిణి కార్తె రాకమునుపే రోకళ్లు పగిలేలా ఎండ దంచికొడుతోంది. ఉదయం 10 నుంచి సాయంత్రం నాలుగింటిదాకా మాడు పగిలేలా ఎండ కొడుతోంది.
రాష్ట్రంలో భానుడి భగభగ, ఉక్కబోత
నేటి నుంచి వారం పాటు భారీ ఎండలు
హైదరాబాద్, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): రోహిణి కార్తె రాకమునుపే రోకళ్లు పగిలేలా ఎండ దంచికొడుతోంది. ఉదయం 10 నుంచి సాయంత్రం నాలుగింటిదాకా మాడు పగిలేలా ఎండ కొడుతోంది. రాష్ట్రంపై భానుడి నిప్పులు చిమ్ముతున్నాడు. నేటి నుంచి వారం పాటు ఎండ తీవ్రత మరింత పెరగనుంది. అన్ని జిల్లాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు 42-45 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉష్ణోగ్రతలకు సంబంధించి అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ప్రధానంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, నల్లగొండ, సూర్యాపేట, గద్వాల జిల్లాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. మిగతా జిల్లాల్లోనూ 41-43 మధ్య నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్‌లో 40-42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. సోమవారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో అత్యధికంగా 41.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది.