వడదెబ్బ బాధితులకు సత్వర చికిత్స: దామోదర
ABN , Publish Date - Apr 16 , 2026 | 04:04 AM
రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్నందున వడదెబ్బ బాధితులకు సత్వరమే చికిత్స అందేలా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చర్యలు చేపట్టాలని ఆరోగ్య శాఖ ..
హైదరాబాద్, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్నందున వడదెబ్బ బాధితులకు సత్వరమే చికిత్స అందేలా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చర్యలు చేపట్టాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. హాస్పిటల్ ఎమర్జెన్సీ విభాగం వద్ద ఒక బృందాన్ని ఎప్పుడూ సిద్ధంగా ఉంచాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని, అవసరమైనచోట ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయాలని, ఐసీయూలు, ఇతర వార్డుల్లో ఏసీలు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. బుధవారం ఆయన ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లు, డెలివరీ బాయ్స్, ఇతర గిగ్ వర్కర్లకు వడదెబ్బ బారినపడకుండా అవగాహన కల్పించాలని చెప్పారు. వేసవిలో అగ్ని ప్రమాదాలు జరిగే ముప్పు ఉంటుందని, అన్ని ఆస్పత్రుల్లో పవర్ కేబుల్స్‌ను తనిఖీ చేయించాలన్నారు.