వడదెబ్బకు 31 మంది మృతి
ABN , Publish Date - May 23 , 2026 | 05:06 AM
రాష్ట్రంలో రోహిణి కార్తెకు ముందే మంట పెట్టినట్లుగా ఎండ కాస్తోంది. ఈ నెల 25న రోహిణి కార్తె ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఎండల తీవ్రత ఇంకెంతగా ఉంటుందోనన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
20 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైనే!.. రోహిణికి ముందే ఎండల మంటలు
తీవ్రమైన వడగాల్పులు.. సిర్పూర్‌లో అత్యధికంగా 46.5 డిగ్రీలు
హైదరాబాద్, మే 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రోహిణి కార్తెకు ముందే మంట పెట్టినట్లుగా ఎండ కాస్తోంది. ఈ నెల 25న రోహిణి కార్తె ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఎండల తీవ్రత ఇంకెంతగా ఉంటుందోనన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. శుక్రవారం వడదెబ్బతో రాష్ట్రంలో 31 మంది మృత్యువాతపడ్డారు. తెలంగాణలో వరుసగా మూడో రోజూ ఎండ తీవ్రత కొనసాగింది. 20 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకుపైగా నమోదు కావడం వేసవి తీవ్రతకు అద్దం పడుతోంది. ఎండల నుంచి మరో వారం దాకా ఎటువంటి ఉపశమనం కలగదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు రాష్ట్రంలో 48 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని కొన్ని తూర్పు, ఉత్తర జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అలాగే శనివారం కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాగా శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. జగిత్యాల జిల్లా ధర్మపురి, కరీంనగర్ జిల్లా గంగాధర, మంచిర్యాల జిల్లా ఖాజీపేట, నిజామాబాద్ జిల్లా యర్‌గట్ల, సిరిసిల్ల జిల్లా కోనరావుపేట, సూర్యాపేట జిల్లా మోతెలలో46.4, హన్మకొండ జిల్లా కమలాపూర్, భూపాలపల్లిజిల్లా మొగుళ్లపల్లి, ఖమ్మం జిల్లా ఖమ్మం, ములుగు జిల్లా ఏటూరునాగారం, నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లలో 46.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, వడదెబ్బ మృతుల్లో శుక్రవారం ఉమ్మడి జిల్లాలవారీగా ఖమ్మం, కరీంనగర్‌లలో 9 మంది చొప్పున, వరంగల్‌లో ఏడుగురు, నల్లగొండలో ముగ్గురు, మెదక్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్‌లలో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.
స్కూటీ దగ్ధం.. దంపతులు సురక్షితం
ఎండల తీవ్రతకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోభానగర్ సమీపంలో శుక్రవారం స్కూటీ దగ్ధమైంది. పాల్వంచకు చెంది దంపతులు ఏన్కూర్ నుంచి స్కూటీపై పాల్వంచకు వెళుతుండగా సీతారామ కెనాల్ వద్ద మంటలు వచ్చాయి. వారు వెంటనే స్కూటీని రహదారి పక్కన ఆపి దూరంగా పరుగు తీశారు. మంటల్లో స్కూటీ పూర్తిగా దగ్ధమైంది.
పంట పొలాల్లో మంటలు
జనగామ జిల్లాలో శుక్రవారం పంట పొలాల్లో మంటలు చెలరేగి రైతులు నష్టపోయారు. చిలుపూర్ మం డలం నష్కల్‌లో విద్యుదాఘాతంతో చెలరేగిన మంట లు ఎండ తీవ్రత, వడగాలులకు విస్తరించి గడ్డివాములు, తాటిచెట్లు కాలి బూడిదయ్యాయి. రఘునాథపల్లి మండలం గబ్బెటలో జరిగిన అగ్నిప్రమాదంలో వరిగడ్డి కుప్పలతోపాటు పలువురు రైతుల ధాన్యం, పంట అగ్నికి ఆహుతయ్యాయి. బచ్చన్నపేట మండలం వీఎస్ఆర్‌నగర్‌లో ట్రాన్స్‌ఫార్మర్ వద్ద షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు వ్యాపించి పైపులైన్లు, స్టార్టర్లు, సర్వీసు వైర్లు, గడ్డి కట్టలు కాలిపోయాయి. బచ్చన్నపేటలో విద్యుత్ లైన్ షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగి పంటపొలం దగ్ధమైంది.