Share News

భగ్గుమంటున్న ఎండలు

ABN , Publish Date - May 30 , 2026 | 04:08 AM

రోహిణి కార్తె ప్రవేశించడంతో రాష్ట్రంలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రోజురోజుకు పెరుగుతున్న ఎండలు, తీవ్ర వడగాల్పుల ధాటికి జనం విలవిలలాడిపోతున్నారు

భగ్గుమంటున్న ఎండలు

  • కుమురం భీం జిల్లా దహెగాంలో 46.3 డిగ్రీలు

  • వడదెబ్బతో రాష్ట్రంలో 13మంది బలి

  • ఉక్కపోతతో అల్లాడుతున్న జనం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

రోహిణి కార్తె ప్రవేశించడంతో రాష్ట్రంలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రోజురోజుకు పెరుగుతున్న ఎండలు, తీవ్ర వడగాల్పుల ధాటికి జనం విలవిలలాడిపోతున్నారు. శుక్రవారం కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా దహెగాంలో అత్యధికంగా 46.3, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 46.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్‌, అదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో ఎండతీవ్రత మునుపెన్నడూ లేనివిధంగా ఉండటంతో పగటిపూట ప్రజలు బయటరావడానికి జంకుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బ ప్రభావంతో వేర్వేరు ప్రాంతాల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో 46.2డిగ్రీలు, ఓదెలలో 46.1, అంతర్గాం మండలం ఆకెనపల్లిలో 45.9, పాలకుర్తి మండలం ఈసాల తక్కెళ్లపల్లి 45.7, జగిత్యాల జిల్లా నేరెళ్లలో 46, అల్లీపూర్‌లో 45.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్‌ జిల్లాలో దాదాపు అన్ని మండలాల్లో 42 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లా కేంద్రంలో 44.6 డిగ్రీలు, మోస్రాలో 44.6, బిచ్కుంద 44.9, మద్నూర్‌ 44.7, పిట్లం 44.6, గాంధారి 44.5, ఎల్పుగొండ 44.4, కొల్లూర్‌ 44.2, జుక్కల్‌ 43.9, బోధన్‌, సాలూర, పోతంగల్‌, డొంకేశ్వర్‌, బాల్కొండ, మెండోర, ముప్కాల్‌లలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మధ్యాహ్నం నుంచి వాతావరణం మబ్బులతో కొంత చల్లబడినట్లు కనిపించింది. కాగజ్‌నగర్‌ మండలం జంబుగాలో 46, భీంపూర్‌ మండలం అర్లి(టి)లో 45.0, జైనథ్‌లో 44.9, బోథ్‌ మండలం పొచ్చెరలో 44.8, తలమడుగు, ఉట్నూర్‌లో 44.7, బోరజ్‌లో 44.6, నిర్మల్‌లో 42 డిగ్రీలు నమోదయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం రాత్రి వీచిన గాలిదుమారానికి తోడు అక్కడక్కడ చిరుజల్లులు పడటంతో కాస్త ఉపశమనం లభిందని అంతా భావించారు. శుక్రవారం వడగాలుల తీవ్రత కాస్త తగ్గినా ఎండ మాత్రం బాబోయ్‌ అనిపించింది. ఖమ్మం జిల్లాలో 42, భద్రాద్రి కొత్తగూడెంలో 41.6డిగ్రీల సెల్సియస్‌ సగటు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


తీవ్రమైన ఎండల కారణంగా పొలం పనులు, కూలీ పనులకు వెళ్లినవారు పశువుల కాపరులు వడదెబ్బకు గురై మరణించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండదెబ్బ కారణంగా ఏకంగా ఆరుగురు మృత్యువాత పడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పశువుల కాపరి కోవాసి భీమయ్య(45), యారం చిన్నసుబ్బారెడ్డి(46), కార్పెంటర్‌ కళ్లకూరి వెంకట్‌రావు(62).. అలాగే, ఖమ్మం జిల్లా చెందిన కొత్తపల్లి నాగేశ్వరరావు (61), వ్యవసాయ కూలీ కటారు వెంకటేశ్వర్లు (58), పండ్ల వ్యాపారి ఆలకుంట రామకృష్ణ (50) మృతి చెందిన వారిలో ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన సామాన్‌ వీరన్న (68), రాచర్ల సంపత్‌ (55), తునికాకు కూలీ బండారి ప్రమీల (53), ఇంజపురి కనకయ్య(40) మృతి చెందారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు సంగీత (40), సిద్ధిపేట జిల్లా చంద్లాపూర్‌కు చెందిన పురుమాండ్ల ఇంద్రసేనారెడ్డి (55), కామారెడ్డి జిల్లాకు గొర్రెల కాపరి కందూరి సాయన్న(65) ప్రాణాలు కోల్పోయారు.

Updated Date - May 30 , 2026 | 04:08 AM