నిప్పుల కుంపటే..!!
ABN , Publish Date - Apr 17 , 2026 | 03:57 AM
రాష్ట్రంలో భానుడు గురువారం ఉగ్రరూపం దాల్చాడు. దాదాపు అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైబడిన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల, కుమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్....
రాష్ట్రంలో గురువారం భానుడి ఉగ్రరూపం
జగిత్యాల జిల్లా గుల్లకోటలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత
చాలా జిల్లాల్లో 40 డిగ్రీలకు పైనే
వడదెబ్బతో ఇద్దరి మృతి
ఓ ఘటనలో కొడుకు మరణవార్త విని ఆగిన తల్లి గుండె
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
రాష్ట్రంలో భానుడు గురువారం ఉగ్రరూపం దాల్చాడు. దాదాపు అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైబడిన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల, కుమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల్లోని పలు మండలాల్లో 44 డిగ్రీలకు పైబడిన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా ఎండపెల్లి మండ లం గుల్లకోటలో రాష్ట్రంలోనే అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, నాగర్‌కర్నూల్, నిజామాబాద్, కామారెడ్డి తదితర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 43 డిగ్రీలకు పైబడిన ఉష్ణోగ్రతలు రికార్డయ్యా యి. హైదరాబాద్‌లోని గండిపేట ప్రాంతంలో గురువా రం 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక, ఎండల తీవ్రతతో వడదెబ్బకు గురై రాష్ట్రంలో గురువారం ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని తూముకుంటకు చెందిన కురువ మల్లన్న (38) గురువారం ఉదయం పొలం పని చేసుకొని ఇంటికి తిరిగొచ్చాక అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మరణించాడు. మల్లన్న మరణవార్త విని అతని తల్లి రంగమ్మ సొమ్మసిల్లిపడిపోయి ప్రాణాలు కోల్పోయారు. ఇక, నారాయణపేట జిల్లా నర్వ మండలంలోని ఉందెకోడ్‌కు చెందిన సర్దార్(40) అనే వంటమాస్టర్ వడదెబ్బకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఎండల తీవ్రతకు సర్దార్ సోమవారం అస్వస్థతకు గురి కాగా.. కుటుంబసభ్యులు మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మరణించాడు.
పిడుగుపాటుకు ఒకరి మృతి
జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని మల్లెందొడ్డి గ్రామంలో పిడుగుపాటుకు గురై బిహార్‌కు చెందిన ఆరీఫ్(24) అనే లారీ డ్రైవర్ గురువారం ప్రాణాలు కోల్పోయాడు. మల్లెందొడ్డి శివారులోని ఓ బొప్పాయి తోటలోని పండ్లను లారీలోకి కూలీలు లోడ్ చేస్తుండగా గురువారం సాయం త్రం వడగండ్లతో కూడిన గాలివాన కురిసింది. అయితే, పండ్లపై టార్పాలిన్ కప్పేందుకు ఆరీఫ్ లారీపైకి ఎక్కగా అదే సమయంలో పిడుగుపడింది. దీంతో ఆరీఫ్ ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.