Share News

భానుడి మృత్యుకేళి

ABN , Publish Date - May 26 , 2026 | 04:55 AM

రాష్ట్రంలో భానుడి మృత్యుకేళి కొనసాగుతోంది. ఎండల తీవ్రతకు ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. సోమవారం నుంచి రోహిణి కార్తె ప్రారంభం కావడంతో ఎండలు మరింత పెరిగాయి...

భానుడి మృత్యుకేళి

  • వడదెబ్బకు ఒక్కరోజే 52 మంది మృతి

  • ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో 30 మంది మృతి

  • కరీంనగర్‌లో 11 మంది.. నల్లగొండలో ఆరుగురు..నిజామాబాద్‌లో నలుగురు

  • మరో 4 రోజులు తీవ్రమైన ఎండలు

  • పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీచేసిన వాతావరణ కేంద్రం

  • రుతుపవనాలు మరికొన్ని రోజులు ఆలస్యం: ఐఎండీ

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో భానుడి మృత్యుకేళి కొనసాగుతోంది. ఎండల తీవ్రతకు ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. సోమవారం నుంచి రోహిణి కార్తె ప్రారంభం కావడంతో ఎండలు మరింత పెరిగాయి. ఎండలకు తోడు వడగాలులు వీస్తుండడంతో వడదెబ్బ మృతుల సంఖ్య పెరుగుతోంది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బతో 52 మంది మరణించారు. గతవారం రోజుల వ్యవధిలోనే ఎండలకు తాళలేక దాదాపు 200 మందికిపైగా మరణించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఈ జిల్లాలోనే వడదెబ్బ మృతులు అధికంగా ఉంటున్నారు. జిల్లాలో వడదెబ్బతో సోమవారం 16 మంది మృతి చెందారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆరుగురు మరణించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 14 మంది మృతిచెందారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోనూ వడదెబ్బతో సోమవారం 11 మంది చనిపోయారు. నిజామాబాద్‌ జిల్లాలో నలుగురు, సిద్దిపేట జిల్లాలో ఒక వ్యక్తి మృతిచెందాడు. కాగా, రాష్ట్రంలో సోమవారం అనేకచోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45-46 డిగ్రీ సెంటీగ్రేడ్‌ వరకు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్లలో 46.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉమ్మడి నల్లగొండ, వరంగల్‌ జిల్లాల్లో అంతటా 43 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌ చాంద్రాయణగుట్టలో సోమవారం 42.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయ్యింది. మరో నాలుగు రోజులపాటు ఎండలు తీవ్రంగానే ఉంటాయని హైదరాబాద్‌ వాతావరణ విభాగం తెలిపింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీచేసింది.

Updated Date - May 26 , 2026 | 04:55 AM