Share News

జనం.. ఉక్కరిబిక్కిరి

ABN , Publish Date - May 27 , 2026 | 05:37 AM

రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం 13 జిల్లాల్లో 46డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ....

జనం.. ఉక్కరిబిక్కిరి

  • 13 జిల్లాల్లో 46 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు

  • నల్లగొండ జిల్లాలో 46.5డిగ్రీలు

  • రాష్ట్రంలో వడదెబ్బతో 32 మంది మృతి

  • నేడు, రేపు.. తీవ్ర వడగాల్పులు

  • 5 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలెర్ట్‌

  • 3 జిల్లాల్లో ఈదురుగాలుల వర్షం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం 13 జిల్లాల్లో 46డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న మూడు రోజులూ.. గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగుతాయని పేర్కొంది. కాగా, రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో బుధ, గురు వారాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వడగాడ్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంటూ రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. అలాగే, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ ఇచ్చింది. నల్లగొండ జిల్లాలోని వేములపల్లిలో అత్యధికంగా 46.5డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, సూర్యాపేట జిల్లా గరిడేపల్లి, నిజామాబాద్‌ జిల్లాలోని మచ్చర్ల, జగిత్యాల జిల్లా రాఘవపేటలో 46.4, కోరుట్లలో46.3, పెద్దపల్లి జిల్లా ఆకెనపల్లిలో 46.3, మంచిర్యాల జిల్లా తాండూరులో 46.1, ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడలో 45.6, తాంసిలో 45.5డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

2.jpg


ఈదురు గాలులకుకూలిన చెట్లు

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. మంచిర్యాల జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురవగా, ఈదురుగాలుల ధాటికి రోడ్లపై చెట్లు కూలాయి. విద్యుత్‌ తీగలు తెగిపోయి సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వరి కల్లాల్లో ఉన్న ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌లోని పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. పెద్దపల్లి జిల్లా రామగిరిలో ఈదురుగాలుల ధాటికి తెనుగుపల్లిలో కనకయ్య ఇంటి ఎదుట ఉన్న రేకులు ఎగిరిపోయి సమీపంలోని ఇళ్లపై పడ్డాయి. భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురంలో అరగంట పాటు వర్షం కురిసింది. విద్యుత్‌ వైర్లు తెగిపడి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. నల్లగొండ జిల్లా చీకటిమామిడిలో ఈదురుగాలులకు చెట్లు విరిగాయి. భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల, మొగుళ్లపల్లి, టేకుమట్ల, భూపాలపల్లి, రేగొండ మండలాల్లో అకాల వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. జడల్‌పేట, నైన్‌పాక, తిరుమలపూర్‌, చిట్యాల తదితర గ్రామాల్లో మక్కలు, వరి ధాన్యం తడిసిపోయింది. చిట్యాల- చల్లగరిగ ప్రధాన రహదారిపై చెట్లునేల కూలడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భూపాలపల్లి మండలంలోని గొర్లవీడు, వజినపల్లి, నేరేడుపల్లిలలో వర్షం ప్రజలను అతలాకుతలం చేసింది. కల్లాల్లో ఉన్న ధాన్యం, మిర్చి తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందారు. రేగొండ మండలంలోని లింగాలలో తిప్పారపు రాజు(34) పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, మనోహరాబాద్‌లో భారీ వర్షం కురవగా, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది.

ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 12 మంది మృతి

రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఒక్క రోజే వడదెబ్బకు గురై 32 మంది మృతి చెందారు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 12 మంది, కొత్తగూడెం జిల్లాలో ఐదుగురు వడదెబ్బకు గురై మరణించారు. ములుగు జిల్లాలో నలుగురు, జనగామ జిల్లాలో ఒకరు, మహబూబాబాద్‌ జిల్లాలో ఇద్దరు, పెద్దపల్లి జిల్లాలో ఇద్దరు, కరీంనగర్‌ జిల్లాలో ఇద్దరు, మంచిర్యాల జిల్లాలో ఒకరు, సూర్యాపేట జిల్లాలో ఒకరు, ఆసిఫాబాద్‌ జిల్లాలో ఒకరు, నారాయణపేట జిల్లాలో ఒకరు వడదెబ్బ తగిలి మృతి చెందారు.

Updated Date - May 27 , 2026 | 05:37 AM