ఆ ఆస్పత్రుల్లోనూ సర్జరీలు చేయాలి
ABN , Publish Date - Aug 23 , 2026 | 05:41 AM
మేజర్ సర్జరీలు కూడా చేయగలిగే పూర్తిస్థాయి వైద్య కేంద్రాలుగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీ), ఏరియా హాస్పిటళ్లు, జిల్లా ఆస్పత్రులు అభివృద్ధి చెందాలని..
ఆ స్థాయికి సీహెచ్‌సీలు, ఏరియా, జిల్లా హాస్పిటళ్లు అభివృద్ధి చెందాలి
ప్రభుత్వ ఆస్పత్రులపై సమీక్షలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): మేజర్ సర్జరీలు కూడా చేయగలిగే పూర్తిస్థాయి వైద్య కేంద్రాలుగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీ), ఏరియా హాస్పిటళ్లు, జిల్లా ఆస్పత్రులు అభివృద్ధి చెందాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. టీచింగ్ హాస్పిటళ్లతో సమానం గా స్థానికంగానే ప్రజలకు వైద్యసేవలు అందించే సామర్థ్యం జిల్లా, ఏరియా హాస్పిటళ్లకు ఉందని, ఈ మేరకు 1616 మంది స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించామని, సిబ్బందితో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలను కూడా కల్పిస్తున్నామని మంత్రి గుర్తు చేశారు. ‘డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్’ (టీవీవీపీ) పరిధిలోని ఆస్పత్రులపై మంత్రి దామోదర శనివారం సమీక్ష జరిపారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు కూడా పేషంట్లను పెద్ద హాస్పిటళ్లకు రిఫర్ చేసే పరిస్థితి మారాలని.. ఇప్పటికే చాలా మార్పు వచ్చిందని, ఇంకా కొన్ని ఆస్పత్రులు ఇదే పద్ధతిని పాటిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. ఇకనైనా మారకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థానికంగా అందించగల వైద్యసేవలను అందించకుండా పైస్థాయి హాస్పిటళ్లకు పంపడం వల్ల, పేషెంట్లపై అదనపు భారం పడటంతో పాటు, పై ఆస్పత్రుల మీద అనవసర ఒత్తిడి పెరుగుతోందని చెప్పారు. సరైన కారణం ఉంటే తప్ప పేషంట్లను ఇతర ఆస్పత్రులకు రిఫర్ చేయవద్దన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మరో హాస్పిటల్‌కు రిఫర్ చేయాల్సి వస్తే.. ముందుగానే ఆ ఆస్పత్రికి సమాచారం అందించి, అక్కడి వైద్యులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మరోవైపు కొత్త సీటీ స్కాన్లు, ఇతర డయాగ్నస్టిక్, వైద్య పరికరాల అవసరం ఉన్న ఆస్పత్రుల్లో వాటి ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని డీసీహెచ్‌ఎస్‌లను మంత్రి ఆదేశించారు. రోగుల సంఖ్య, అవసరం, ప్రస్తుతం అందిస్తున్న సేవలు, వినియోగ సామర్థ్యం తదితర అంశాల ఆధారంగా స్పష్టమైన వివరాలు ఇవ్వాలన్నారు.
వారానికి ఒక రోజు ఆకస్మిక తనిఖీలు
డీసీహెచ్‌ఎస్‌లు ఆఫీసుల్లో కూర్చుని నివేదికలు పరిశీలిస్తే సరిపోదని మంత్రి దామోదర స్పష్టం చేశారు. తమ పరిధిలోని ప్రతి హాస్పిటల్‌ను వారానికి కనీసం ఒకరోజైనా ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేయాలని ఆదేశించారు. వైద్యులు, సిబ్బంది సమయానికి విధులకు హాజరవుతున్నారా? పేషెంట్లకు సకాలంలో వైద్యం అందుతోందా? పరికరాలు పని చేస్తున్నాయా? టెస్టులు, స్కాన్లు అందుబాటు లో ఉన్నాయా? ఔషధాల పరిస్థితి ఏమిటి? పరిశుభ్రత, తాగునీరు, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సక్రమంగా జరుగుతున్నాయా? తదితర అంశాలను క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించాలన్నారు. డీసీహెచ్‌ఎస్‌లు ప్రతి నెలా తమ పని నివేదికను ప్రభుత్వానికి అందజేయాలన్నారు. వైద్యులు, సిబ్బంది ఆస్పత్రుల్లో విధులకు గైర్హాజరవడం, నిర్ణీత సమ యం కంటే ముందే వెళ్లిపోవడం, విధుల్లో నిర్లక్ష్యం వహించడం వంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు. ఉల్లంఘనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.