Share News

ఆన్‌లైన్‌లోనే ఆరోగ్య శాఖలో బదిలీలు

ABN , Publish Date - May 28 , 2026 | 03:33 AM

వైద్య, ఆరోగ్యశాఖలో ఉద్యోగుల బదిలీలను ఆన్‌లైన్‌ విధానంలోనే నిర్వహించనున్నట్లు సర్కారు స్పష్టతనిచ్చింది. మొత్తం కేడర్‌లో 40 శాతానికి మించకుండా బదిలీలుంటాయని వెల్లడించింది.

ఆన్‌లైన్‌లోనే ఆరోగ్య శాఖలో బదిలీలు

  • 29 నుంచి ప్రక్రియ.. సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన

  • క్యాడర్‌లో 40ు మించకుండా బదిలీలు

  • మార్గదర్శకాల జీవో జారీ

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): వైద్య, ఆరోగ్యశాఖలో ఉద్యోగుల బదిలీలను ఆన్‌లైన్‌ విధానంలోనే నిర్వహించనున్నట్లు సర్కారు స్పష్టతనిచ్చింది. మొత్తం కేడర్‌లో 40 శాతానికి మించకుండా బదిలీలుంటాయని వెల్లడించింది. రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని సడలిస్తూ ఆర్థికశాఖ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా, వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించి ప్రభుత్వం బుధవారం షెడ్యూలును విడుదల చేసింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ డాక్టర్‌ క్రిస్టినా జెడ్‌. చొంగ్తూ జీవో నంబర్‌ 28ను జారీ చేశారు. షెడ్యూలు ప్రకారం.. మే 29న ఖాళీలు, లాంగ్‌లాస్టింగ్‌ ఉద్యోగుల జాబితాను విడుదల చేస్తారు. మే 30, 31 తేదీల్లో అభ్యంతరాలను స్వీకరించి, తుది ఖాళీల జాబితాను జూన్‌ 2న విడుదల చేస్తారు. ఆ తర్వాత జూన్‌ 3, 4 తేదీల్లో ఆప్షన్లతో కూడిన దరఖాస్తులను స్వీకరించి, తుది జాబితా, పోస్టింగ్‌ ఉత్తర్వులను జూన్‌ 6న జారీ చేస్తారు. బదిలీ ప్రక్రియలో మానవ ప్రమేయం లేకుండా, ఉద్యోగుల సీనియారిటీ, లాంగ్‌ స్టాండింగ్‌ ఆధారంగా బదీలులు చేపట్టేలా ప్రతి విభాగానికి ప్రత్యేకంగా సాప్ట్‌వేర్‌ రూపొందించారు.

డీహెచ్‌లోనే అత్యధిక బదిలీలు

వైద్య ఆరోగ్యశాఖ బదిలీల్లో అత్యధికంగా రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుల (డీహెచ్‌) పరిధిలోనే ఉండనున్నాయి. దీనిలో మొత్తం 62 కేడర్లలో ఉద్యోగులు ఉన్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌, వైద్యవిద్య సంచాలకులు, ఆయూష్‌ విభాగం, ఔషధ నియంత్రణ మండలి, ఆరోగ్యశ్రీ, ఔషధ కార్పోరేషన్‌, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలోని ఉద్యోగులను కూడా కలపితే 6వేల మందిపైగా బదిలీ అవుతారని వైద్యవర్గాలు పేర్కొన్నాయి.

టీవీవీపీ రీడిప్లాయ్‌మెంట్‌పై రాని స్పష్టత

పది ఉమ్మడి జిల్లాల పరిధిలోని 28 టీవీవీపీ ఆస్పత్రులు డీఎంఈ పరిఽధిలోకి బదిలీ అయ్యాయి. వాటిలో ఉన్న 5,089 మంది వైద్య, పారామెడికల్‌ సిబ్బందిని ఇతర టీవీవీపీ ఆస్పత్రులకు రీడిప్లాయ్‌ చేయాల్సిఉంది. వీరిని బదిలీలకు ముందే సర్దుబాటు చేస్తారా?, లేదా అనంతరం చేస్తారా? అనేదానిపై స్పష్టత లేదు. నిబంధనల మేరకు బదిలీలకు ముందే చేయాల్సి ఉంటుందని వైద్యవర్గాలు పేర్కొన్నాయి. ఖాళీల జాబితా, సీనియారిటీ, బదిలీల ప్రక్రియను పర్యవేక్షించేందుకు టీజీఎంఎ్‌సఐడీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, హెల్త్‌ కమిషనర్‌, ఆరోగ్యశ్రీ సీఈవో, డీసీఏ డైరెక్టర్‌ జనరల్‌, ఆరోగ్యశాఖ జాయింట్‌ సెక్రటరీలతో కూడిన ఉన్నతస్థాయి స్ర్కూటినీ కమిటీని ఏర్పాటు చేశారు. అలాగే ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక గ్రీవెన్స్‌ సెల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.

Updated Date - May 28 , 2026 | 03:33 AM