వైద్యశాఖలోనూ ఆన్‌లైన్ బదిలీలే!
ABN , Publish Date - May 19 , 2026 | 05:43 AM
అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు వైద్యారోగ్య శాఖలో ఉద్యోగుల బదిలీలను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో ఉపాధ్యాయుల బదిలీలను ఆన్‌లైన్‌లోనే నిర్వహించారు.
సుమారు 6 వేల పైచిలుకు ఉద్యోగుల బదిలీకి ఏర్పాట్లు.. డీహెచ్‌లో అత్యధికంగా 2,400 మందికి స్థానచలనం
డీఎంఈలో సంఘాల పేరుతో ఆగిపోయేవారే ఎక్కువ!
పలు అంశాలపై స్పష్టత కోరుతూ సర్కారుకు వైద్యశాఖ లేఖ
ఈ నెల చివరి నాటికి ప్రక్రియ పూర్తికి సర్కారు ఆదేశం
జూన్ రెండోవారం వరకు వైద్యశాఖ గడువు కోరినట్లు సమాచారం
హైదరాబాద్, మే 18 (ఆంధ్రజ్యోతి): అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు వైద్యారోగ్య శాఖలో ఉద్యోగుల బదిలీలను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో ఉపాధ్యాయుల బదిలీలను ఆన్‌లైన్‌లోనే నిర్వహించారు. ఆ ప్రక్రియపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. దీంతో వైద్యారోగ్యశాఖలోనూ అదే విధానాన్ని అనుసరించాలని ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ విధానంలో ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా మానవ ప్రమేయం లేకుండా బదిలీలు జరిగిపోతాయి. గతంలో వైద్యారోగ్య శాఖలో ఆఫ్‌లైన్‌లో బదిలీలు నిర్వహించటంతో భారీగా అక్రమాలు జరిగాయని, కొందరు విభాగాధిపతులు రూ.కోట్లలో వెనకేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆప్షన్స్‌లో వైద్య సిబ్బందికి ఖాళీల వివరాలన్నీ చూపుతారు. ఉద్యోగులు ఇచ్చే ఆప్షన్స్‌లో మొదటి ఐదు స్థానాలను ప్రాధాన్యతగా పెట్టుకుని, మిగిలిన ఖాళీలను కూడా టిక్ చేసుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. ఇచ్చిన ఆప్షన్స్, స్పౌజ్, హెల్త్ గ్రౌండ్స్, వేకెన్సీ ఆధారంగా ఆటోమెటిక్‌గా బదిలీ ప్రక్రియ జరిగిపోతుందని ఒక అధికారి చెప్పారు.
బదిలీలకు 6 వేల మంది అర్హులు
సాధారణ బదిలీల్లో భాగంగా వైద్యారోగ్యశాఖలోని అయా విభాగాధిపతుల పరిధిలో బదిలీ అయ్యే ఉద్యోగుల లెక్కను తేల్చారు. మొత్తంగా సుమారు 6 వేల మంది బదిలీ అయ్యే అవకాశం ఉన్నట్లు ఆ శాఖ వర్గాలు వెల్లడించాయి. బదిలీల మార్గదర్శకాలు ఒకటి రెండు రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు ఉన్నతాఽధికారులు తెలిపారు. బదిలీల ప్రక్రియను ఈ నెల 31లోగా పూర్తిచేయాలని ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో ఆదే శించింది. కానీ, ఆలోగా ప్రక్రియ పూర్తి కావడం అనుమానమేనని వైద్యవర్గాలు అంటున్నాయి. బదిలీలను పూర్తిచేసేందుకు మరికొంత సమయం ఇవ్వాలని వైద్యశాఖ సర్కారును కోరినట్లు సమాచారం. జూన్ రెండోవారం వరకు సమయం కోరినట్లు తెలిసింది.
డీహెచ్‌లోనే అత్యధికం
బదిలీల్లో అత్యధికంగా రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోనే ఉన్నాయి. డీహెచ్ పరిఽధిలో మొత్తం మంజూరైన పోస్టులు 27,812 ఉండగా, ప్రస్తుతం 18,226 మంది పనిచేస్తున్నారు. బదిలీ పరిధిలోకి వచ్చేవారు 7,289 మంది ఉన్నారు. వీరిలో సుదీర్ఘకాలంగా ఒకేచోట ఉన్నవారు (లాంగ్ స్టాండింగ్) 2,403 మంది ఉన్నట్లు ప్రజారోగ్య సంచాలకుడు రవీంద్ర నాయక్ ప్రభుత్వానికి నివేదిక పంపారు. బదిలీ అయ్యే సిబ్బంది సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని డీహెచ్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో మంజూరైన పోస్టులు 10,454 ఉండగా, ప్రస్తుతం 4,869 మంది పనిచేస్తున్నారు. వీరిలో 1,930 మంది బదిలీల పరిధిలోకి వచ్చారు. లాంగ్ స్టాండింగ్ జాబితాలో 920 మంది ఉన్నారు. వైద్యవిద్య సంచాలకుల పరిధిలో పరిస్థితి విచిత్రంగా ఉంది. అక్కడ 8,597 మంజూరైన డాక్టర్ పోస్టులు ఉండగా.. ప్రస్తుతం 3,072 మంది పనిచేస్తున్నారు. వీరిలో 1,228 మంది బదిలీ పరిధిలోకి వచ్చారు. లాంగ్ స్టాండింగ్ జాబితాలో 525 మంది ఉన్నారు. డీఎంఈ పరిధిలోని వైద్య సంఘాలు లెక్కకు మించి ఉన్నాయి. ఇందులో సాధారణ పరిపాలన శాఖ గుర్తించినవి ఎన్ని అంటే మాత్రం వైద్యశాఖ వద్ద సమాధానం లేదు. లాంగ్ స్టాండింగ్ జాబితాలో 525 మంది వైద్యులుంటే... అయా సంఘాల్లో నాయకులు, ఆఫీసు బేరర్ల పేరుతో 600 మందికి పైచిలుకు ఉన్నట్లు సమాచారం. వీరంతా బదిలీల నుంచి మినహాయింపు కోరుతున్నారు. ఆయుష్, ఔషధ నియంత్రణ మండలి, ఆరోగ్యశ్రీ, ఔషధ కార్పొరేషన్, కుటుంబ సంక్షేమ విభాగాలన్నింటిని కలిపితే సుమారు 6 వేల మందికిపైగా బదిలీ అవుతారని వైద్యశాఖ వర్గాలు తెలిపారు.
8 అంశాలపై స్పష్టత కోరిన కమిషనర్
ఈ శాఖలో సిబ్బంది బదిలీల్లో కొన్ని అంశాలపై స్పష్టత కరువైంది. ముఖ్యంగా యూనియన్ల నేతలు, ఆఫీసు బేరర్లలో ఎంతమందికి బదిలీల నుంచి మినహాయింపునివ్వాలి? సాధారణ పరిపాలన శాఖ ఏయే సంఘాలకు గుర్తింపునిచ్చింది. ఒక్కో యూనియన్‌లో ఎంతమందికి అవకాశం ఇవ్వాలన్నదానిపై ఇంతవరకు వైద్యశాఖ వద్ద స్పష్టత లేదు. అలాగే ఫోకల్ - నాన్ ఫోకల్ బదిలీలపై కూడా స్పష్టత లేదు. గతంలో హైదరాబాద్ నుంచి మహేశ్వరంకు బదిలీ చేస్తే ఫోకల్ నుంచి నాన్ ఫోకల్‌గా పరిగణించారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిధి పెరగడంతో మహేశ్వరం కూడా ఫోకల్ ఏరియా కిందకు వస్తోంది. ఈ అంశంపై కూడా స్పష్టత ఇవ్వాలని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ డాక్టర్ సంగీతా సత్యనారాయణ ప్రభుత్వానికి లేఖ రాశారు. మొత్తం 8 అంశాలపై స్పష్టత కోరినట్లు సచివాలయ వర్గాలు వెల్లడించాయి.