Share News

వైద్య శాఖలో 5 వేల మంది బదిలీ

ABN , Publish Date - Jun 10 , 2026 | 04:51 AM

వైద్య ఆరోగ్య శాఖలో బదిలీల పర్వం కొనసాగుతోంది. మంగళవారం రాత్రి వరకు మొత్తం 4,867 మందిని బదిలీ చేశారు. ఇందులో అత్యధికంగా ప్రజారోగ్య సంచాలకుల...

వైద్య శాఖలో 5 వేల మంది బదిలీ

హైదరాబాద్‌, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్య శాఖలో బదిలీల పర్వం కొనసాగుతోంది. మంగళవారం రాత్రి వరకు మొత్తం 4,867 మందిని బదిలీ చేశారు. ఇందులో అత్యధికంగా ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని 2,258 మంది ఉన్నారు. మరో 500 మంది వరకు నర్సింగ్‌ సిబ్బందిని బదిలీ చేయాల్సి వుందని ఆ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ)లో 21 క్యాడర్లలో 557 మందిని, వైద్య విధాన పరిషత్‌(టీవీవీపీ)లో 26 క్యాడర్లలో 959 మందిని బదిలీ చేశారు. టీవీవీపీలో వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది పెట్టుకున్న వెబ్‌ ఆప్షన్లకు బదులు వేరే ప్రాంతాలకు బదిలీ చేశారు. ఉదాహరణకు చౌటుప్పల్‌లో పనిచేసేవారిని కర్ణాటక సరిహద్దులోని ఆస్పత్రులకు బదిలీ చేశారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో జరిగిన క్లర్కికల్‌ తప్పిదాలను సరిదిద్దారు. గతంలో ఆఫ్‌లైన్‌ పద్ధతిలో చేపట్టిన బదిలీ ప్రకియలో అక్రమాలు చోటుచేసుకోవడంతో ఈసారి ఆన్‌లైన్‌ పద్ధతిలో చేపట్టారు. అయితే దక్షిణ తెలంగాణలోని ఓ జిల్లాల్లో ఓ పుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ను బదిలీ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే కొన్ని క్యాడర్లలో కొందరు బదిలీ కాలేదని, ఫోకల్‌ టూ ఫోకల్‌ ప్లేసులో ఉండిపోయారన్న ఆరోపణలు వినిపించాయి. హైదరాబాద్‌ ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో పనిచేసే నర్సులు కొందరు ఇక్కడిక్కడే బదిలీ అయ్యారని ఇతర నర్సులు ఆధారాలతో బయటపెట్టారు. నీలోఫర్‌ నుంచి 140 మంది నర్సులు బయటకెళితే అక్కడికి కేవలం 40 మందినే బదిలీ చేశారు. గాంధీ నుంచి 66 మంది బదిలీ అయితే 82 మంది అక్కడికి వెళ్లారు. ఉస్మానియా నుంచి 130 మంది బయటకెళితే 52మందికి అక్కడికి బదిలీ అయ్యారు.

Updated Date - Jun 10 , 2026 | 04:51 AM