వైద్యశాఖలో వొడవని బదిలీల పర్వం
ABN , Publish Date - Jun 09 , 2026 | 04:27 AM
వైద్య, ఆరోగ్యశాఖలో బదిలీల పర్వం వొడవని ముచ్చటగా సాగుతోంది. సాధారణ బదిలీలను ఈనెల 1 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించినా..
3 ఏళ్ల సర్వీసు వారికీ అవకాశం.. ఆర్థికశాఖ అనుమతి కోసం ఎదురుచూపు
హైదరాబాద్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): వైద్య, ఆరోగ్యశాఖలో బదిలీల పర్వం వొడవని ముచ్చటగా సాగుతోంది. సాధారణ బదిలీలను ఈనెల 1 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించినా.. వైద్యశాఖ మాత్రం జూన్ 6 వరకు మొత్తం బదిలీల ప్రక్రియను పూర్తిచేస్తామని తెలిపింది. ఆ మేరకు జీవో కూడా జారీ చేసింది. కాగా, ఇంతవరకు కూడా బదిలీల వ్యవహరం పూర్తికాకపోగా.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకేచోట నాలుగేళ్లకుపైగా పనిచేస్తున్న వారిని, మొత్తం బదిలీల్లో 40శాతం పరిధిలోకి వచ్చే వైద్య సిబ్బందిని గుర్తించి బదిలీ చేస్తున్నారు. అయితే మూడేళ్లు దాటిన వారికి కూడా బదిలీల్లో అవకాశం కల్పిస్తూ చివరిరోజు హడావిడిగా హెచ్‌వోడీలు ప్రకటనలు జారీ చేశారు. మూడేళ్లు ఒకేచోట పనిచేసే వారిని బదిలీల పరిధిలోకి తీసుకురావాలంటే ఆర్థికశాఖ అనుమతి తప్పనిసరి. దీంతో ఆర్థికశాఖ అనుమతి కోసం వైద్యశాఖ నివేదించింది. అక్కడి నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే మూడేళ్లు నిండిన వారిని బదిలీ చేయనుంది. ఈ మొత్తం ప్రక్రియ ముగిసేందుకు మరికొన్ని రోజులు పట్టే అవకాశమున్నట్లు కనిపిస్తోంది.