Share News

వైద్యపరికరాలొద్దు..శానిటేషనే ముద్దు!

ABN , Publish Date - Apr 09 , 2026 | 07:06 AM

కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీ(సీఎస్ఆర్‌) కింద కార్పొరేట్‌ కంపెనీలు అందించే నిధుల విషయంలో వైద్యశాఖ వైఖరి వింతగా ఉంటోంది. కొన్ని ఫార్మా కంపెనీలు సీఎ్‌సఆర్‌ కింద సర్కారీ దవాఖానాలకు మౌలిక సదుపాయాలు, యంత్ర పరికరాలు అందిస్తామంటే..

వైద్యపరికరాలొద్దు..శానిటేషనే ముద్దు!

  • ‘సీఎస్ఆర్‌’పై వైద్యశాఖ వింత వైఖరి

  • వైద్య పరికరాలిస్తామని కంపెనీలు ముందుకొస్తున్నా.. వద్దంటోన్న వైనం

  • కనీసం ప్రతిపాదనలు పంపని తీరు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీ(సీఎస్ఆర్‌) కింద కార్పొరేట్‌ కంపెనీలు అందించే నిధుల విషయంలో వైద్యశాఖ వైఖరి వింతగా ఉంటోంది. కొన్ని ఫార్మా కంపెనీలు సీఎ్‌సఆర్‌ కింద సర్కారీ దవాఖానాలకు మౌలిక సదుపాయాలు, యంత్ర పరికరాలు అందిస్తామంటే.. వైద్య శాఖ మాత్రం పరికరాలు వద్దు అంటోంది. కానీ హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని వివిధ పెద్దాస్పత్రులను సీఎస్ఆర్‌ కింద అడాప్ట్‌ చేసుకుని పారిశుధ్య(శానిటేషన్‌) పనులు చేయమని కోరుతుంది. సీఎస్ఆర్‌ కింద ఆ బాధ్యతలు చేపట్టలేమని, అందుకు నిబంధనలు అంగీకరించవని సదరు సంస్థలు చెబుతున్నాయి. దీంతో విషయం ముందుకెళ్లడం లేదు. నిజానికి, రాష్ట్రంలోని ఫార్మా కంపెనీల యాజమాన్యాలతో సీఎం రేవంత్‌ రెడ్డి గతంలో పలుమార్లు సమావేశమయ్యారు. ఆ తర్వాత వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు కూడా అయా కంపెనీల ప్రతినిధులతో సమావేశమై సీఎ్‌సఆర్‌ నిఽధులపై చర్చించారు. అయితే తమకు ఫలానా ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించాలి? ఫలానా ఎక్విప్‌మెంట్ కావాలంటూ వైద్య శాఖ ఆ కంపెనీల ముందు ఎలాంటి ప్రతిపాదనలు ఉంచలేదని సమాచారం. కానీ, గాంధీ, ఉస్మానియా, నీలోఫర్‌ తదితర ఆస్పత్రుల్లో శానిటేషన్‌ సేవలను అందించాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రతిపాదనలను నేరుగా తిరస్కరించని ఫార్మా కంపెనీల ప్రతినిధులు.. తమ యాజమాన్యాలతో చర్చించి నిర్ణయం చెబుతామని వెళ్లిపోయారు.


అయితే, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అధునాతన యంత్ర పరికరాలను అందిస్తామని చెప్పినట్లు సమాచారం. నిజానికి, సరైన ప్రణాళిక ఉంటే ఫార్మా కంపెనీలు సీఎస్ఆర్‌ కింద ఇచ్చే నిధులను చాలా ప్రభావవంతంగా వినియోగించుకోవచ్చు. ఆస్పత్రుల్లో వసతుల కల్పనకు ఆ నిధులను వాడుకోవచ్చు. అయితే, తమ ఆస్పత్రికి సీఎస్ఆర్‌ కింద నిధులు కేటాయించమని కోరుతూ ఇంత వరకు వైద్యశాఖ నుంచి ఫార్మా కంపెనీలకు ప్రతిపాదన కానీ, లేఖలు రాయడం లాంటివి కానీ జరగలేదని వైద్యవర్గాలే పేర్కొంటున్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 800-1000కి పైగా ఫార్మాసూటికల్స్‌, లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీలున్నాయ. సీఎస్ఆర్‌ కింద ఆయా కంపెనీలు వందల కోట్లు కేటాయిస్తున్నాయి. ఆరోగ్య రంగంపై సీఎస్ఆర్‌ నిధులు ఖర్చు చేసేందుకు చాలా కంపెనీలు ముందుకొస్తున్నాయి. కానీ వైద్య శాఖ చొరవ తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Updated Date - Apr 09 , 2026 | 07:08 AM