Share News

ఆరోగ్య శాఖలో అక్రమాలపై విచారణ

ABN , Publish Date - Aug 22 , 2026 | 05:31 AM

రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయం (డీహెచ్‌)లో ఉద్యోగాల పేరుతో వసూళ్లకు పాల్పడిన ఘటనల మీద క్రిమినల్‌ కేసులు కూడా నమోదయ్యాయి.

ఆరోగ్య శాఖలో అక్రమాలపై విచారణ

  • అడిషనల్‌ డైరెక్టర్‌పై క్రిమినల్‌ కేసు నమోదు

  • విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

  • డీహెచ్‌లో లంచాలపై మరో కమిటీ విచారణ

  • కదులుతున్న ఫైళ్లు.. గంటల్లో క్లియర్‌

  • బాధితుల హర్షం

హైదరాబాద్‌, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయం (డీహెచ్‌)లో ఉద్యోగాల పేరుతో వసూళ్లకు పాల్పడిన ఘటనల మీద క్రిమినల్‌ కేసులు కూడా నమోదయ్యాయి. దీనిపై సర్కారు స్పందిస్తూ.. తక్షణ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు రెండు కమిటీలను నియమించింది. వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ నేతృత్వంలోని కమిటీ శుక్రవారం విచారణ ప్రారంభించింది. మరో కమిటీ అంతకుముందే విచారణ మొదలుపెట్టినట్లు వైద్యశాఖ వర్గాలు తెలిపాయి.


ఇన్‌వార్డులో వినతిపత్రం ఇవ్వాలన్నా లంచమే!

ప్రజారోగ్య విభాగంలో అవినీతి ఎంతలా పేరుకుపోయిందంటే.. చివరికి ఇన్‌వార్డు సెక్షన్‌లో ఓ వినతి పత్రం ఇవ్వాలన్నా డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి. ఇటీవల డీహెచ్‌లో ఒక విభాగాఽధిపతికి తెలిసిన వాళ్లు ఓ విజ్ఞాపన పత్రం ఇచ్చేందుకు వెళ్లగా.. అది తమ పరిధిలోకి రాదని, డీహెచ్‌లోని ఇన్‌వార్డ్‌లో ఇవ్వాలని వారికి సూచించారు. అక్కడ రూ.500 ఇస్తే కానీ ఆ రిక్వెస్ట్‌ లెటర్‌ తీసుకోలేదు. ఈ విషయం ఆ విభాగాధిపతికి తెలిసి ఆశ్చర్యపోయారు. అలాగే, ప్రొబేషన్‌ పీరియడ్‌ తర్వాత సర్వీస్‌ రెగ్యులరైజేషన్‌ కోసం వచ్చే నర్సింగ్‌ స్టాఫ్‌లో ప్రతీ ఒక్కరి నుంచి రూ.5 వేల నుంచి రూ.10 వేలు వసూలు చేస్తున్నారు. ఇక విజిలెన్స్‌ విభాగం నుంచి ఫైలు కదలాలంటే కాసులు గుమ్మరించాల్సిందే. రొటీన్‌గా అయ్యే పనులకు సైతం డబ్బులు చెల్లించాల్సి వస్తుండంతో విసుగు చెందిన ఉద్యోగులు ప్రభుత్వానికి వరుసగా ఫిర్యాదులు చేశారు. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణ జరుగుతున్న క్రమంలోనే స్టాఫ్‌నర్స్‌, అటెండర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తాంటూ డీహెచ్‌ కార్యాలయపు అదనపు డైరెక్టర్‌, మరో ఇద్దరూ కలసి పలువురి వద్ద రూ.19.50 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎంతకూ ఉద్యోగాలు రాకపోవడం, అడిగితే నిర్లక్ష్యపు సమాధానాలు చెప్పడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అడిషనల్‌ డైరెక్టర్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. ఈ తతంగం వెలుగులోకి రావడంతో ప్రభుత్వం మరో విచారణ కమిటీని నియమించింది. ఈ కమిటీ శుక్రవారం విచారణ ప్రారంభించింది. ఉద్యోగాల పేరిటఎంత మంది నుంచి డబ్బులు తీసుకున్నారు? ఎంత వసూలు చేశారు? ఎవరెవరి పాత్ర ఉంది? అన్న కోణా ల్లో దర్యాప్తు ప్రారంభమైంది. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలోనే ఈ దందాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఆ విషయాన్ని డీహెచ్‌ రవీంద్ర నాయక్‌కు పోలీసులు తెలియజేసినా.. ప్రభుత్వానికి, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్‌చోంగ్థుకు తెలియకుండా ఆయన దాచిపెట్టినట్లు విచారణలో వెల్లడైంది. దీన్ని క్రిస్టినా చోంగ్థు సీరియ్‌సగా తీసుకున్నట్లు సమాచారం.


ధైర్యం చేసి ముందుకొస్తున్న బాధితులు

డీహెచ్‌ కార్యాలయపు వసూళ్లపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనం రావడం, ప్రభుత్వం విచారణ కమిటీని నియమించిన నేపథ్యంలో బాధితులు ఒక్కొక్కరు ధైర్యం చేసి ముందుకొస్తున్నారు. వైద్యారోగ్యశాఖ కార్యదర్శికి ఫిర్యాదులు చేస్తున్నారు. తాజాగా నర్సింగ్‌ సెక్షన్‌లో డిప్యూటేషన్‌పై పనిజేస్తున్న ఓ సూపరింటెండెంట్‌ మీద కూడా ప్రభుత్వానికి ఫిర్యాదులందాయి. ప్రభుత్వం విచారణ కమిటీని నియమించిందన్న విషయం తెలియగానే అధికారులు పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను చకచకా క్లియర్‌ చేసినట్లు సమాచారం. కేవలం రెండు రోజుల్లోనే 200కు పైగా ఫైళ్లను క్లియర్‌ చేశారని అక్కడి ఉద్యోగులు చెబుతున్నారు. నెలల కొద్దీ తిరుగుతున్నా కదలని ఫైళ్లు.. సర్కారు విచారణ మొదలుపెట్టగానే గంటల వ్యవధిలో క్లియర్‌ చేస్తుండటంపై బాఽధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Aug 22 , 2026 | 05:33 AM