మెడికల్ రీజినల్ హబ్ ఏఐఐఏలపై దృష్టి
ABN , Publish Date - Mar 10 , 2026 | 04:15 AM
ఇటీవలి బడ్జెట్‌లో ఆరోగ్య రంగంలో ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన సంస్థలను తెలంగాణకు తీసుకువచ్చే దిశగా ....
కేంద్రం ప్రకటించిన ఈ ప్రాజెక్టులను రాష్ట్రానికి తెచ్చేందుకు కసరత్తు
హైదరాబాద్, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): ఇటీవలి బడ్జెట్‌లో ఆరోగ్య రంగంలో ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన సంస్థలను తెలంగాణకు తీసుకువచ్చే దిశగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కసరత్తు చేస్తోంది. ఈ ఆరోగ్య ప్రాజెక్టులను తమ రాష్ట్రాలకు తీసుకెళ్లేందుకు ఇతర రాష్ట్రాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే మిగతా రాష్ట్రాల కంటే ముందుగానే పకడ్బందీ ప్రణాళిక, కార్యాచరణతో వైద్య ఆరోగ్యశాఖ ముందుకెళ్తోంది. దేశంలో ఐదు మెడికల్ రీజినల్ హబ్‌లు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన కేంద్రం.. వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు-ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ)తో అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. వీటిలో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు, ఆధునిక డయాగ్నస్టిక్ కేంద్రాలు, ఆయుష్ వైద్య కేంద్రాలు, మెడికల్ టూరిజం ఫెసిలిటేషన్ సెంటర్లు, రిసెర్చ్ మెడికల్ ఎడ్యుకేషన్ సంస్థలు, పోస్ట్ ట్రీట్‌మెంట్ రిహాబిలిటేషన్ సెంటర్లు ఉంటాయి. అలాగే కొత్తగా మూడు ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద(ఏఐఐఏ)లను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. అలాగే అలైడ్ హెల్త్ ప్రొఫెషన్ శిక్షణ, అత్యవసర ట్రామాకేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఫ్యూచర్ సిటీలో భాగంగా శంషాబాద్ సమీపంలో ఏర్పాటు చేయనున్న మెడికల్ హబ్ లాంటి అంశాలను ప్రస్తావిస్తూ... దాన్ని ఇక్కడే ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరబోతోంది. ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదను తెలంగాణలో ఏర్పాటు చేయాలని గతేడాది అక్టోబరులో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖకు లేఖ రాశారు. తాజాగా మరోమారు కేంద్రాన్ని కోరేందుకు రాష్ట్ర వైద్యశాఖ సిద్ధమైంది.