Share News

Health Department: వైద్యశాఖలో త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు

ABN , Publish Date - Jan 14 , 2026 | 07:30 AM

నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేరుస్తూ సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఈ రెండేళ్లలో 70 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.

Health Department: వైద్యశాఖలో త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు

  • ఇప్పటికే 9,572 ఉద్యోగాలిచ్చాం: మంత్రి దామోదర

  • ల్యాబ్‌ టెక్నీషియన్లకు నియామక పత్రాల అందజేత

హైదరాబాద్‌/అఫ్జల్‌గంజ్‌, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేరుస్తూ సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఈ రెండేళ్లలో 70 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. ఒక్క ఆరోగ్య శాఖలోనే ఇప్పటి వరకు 9,572 పోస్టులను భర్తీ చేశామని, 7,267 ఉద్యోగాల నియామక ప్రక్రియ వివిధ దశల్లో ఉందని తెలిపారు. ఆర్థిక శాఖ అనుమతి ఉన్న మరో 996 పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్‌ను జారీ చేస్తామని, అదనంగా 2,344 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపామని వివరించారు. ల్యాబ్‌ టెక్నీషియన్‌(గ్రేడ్‌-2) పోస్టులకు ఎంపికైన 1,257 మందికి మంగళవారం నియామక పత్రాలను అందజేశారు. కోఠిలోని ఉస్మానియా మెడికల్‌ కాలేజీ గ్రౌండ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి దామోదర హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత వేగంగా ఈ నియామక ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు. డీఎంఈ పరిధిలో 764, డీపీహెచ్‌ పరిధిలో 300, టీవీవీపీ పరిధిలో 180, ఎంఎన్‌జేలో 13 మందికి పోస్టింగ్స్‌ ఇచ్చామని చెప్పారు. ‘ల్యాబ్‌ టెక్నీషియన్లు ఇచ్చే రిపోర్టులే డాక్టర్లకు ప్రామాణికం. వైద్య వ్యవస్థకు వీరు కళ్లు, చెవుల వంటి వారు. వారిచ్చే రిపోర్టుల్లో కచ్చితత్వం ఎంతో ముఖ్యం’ అని మంత్రి పేర్కొన్నారు. త్వరలోనే నూతన హెల్త్‌ పాలసీని రూపొందించి, అమలు చేయబోతున్నామని దామోదర తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వైద్య రంగంలో ఆరోగ్య పరీక్షలు మరింత లోతుగా జరుగుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. హుస్నాబాద్‌లో 250 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులు చకచకా జరగుతున్నాయని చెప్పారు.

నియామకాల్లో అన్యాయం జరిగింది: క్రీడాకారులు

ల్యాబ్‌ టెక్నీషియన్‌నియామక ప్రక్రియ పూర్తయినా అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇంకా 18 మంది క్రీడాకారులకు అన్యాయం జరిగిందని అభ్యర్థులు ప్రవీణ్‌, కృష్ణ, రమేశ్‌లు ఒక ప్రకటనలో ఆరోపించారు. అక్టోబరులో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తిచేసినా జాబితా విడుదల చేయలేదని ఆరోపించారు.

Updated Date - Jan 14 , 2026 | 07:31 AM