వైద్యశాఖలో హెచ్‌ఓడీల నియామకంపై గందరగోళం
ABN , Publish Date - Mar 29 , 2026 | 06:37 AM
వైద్య ఆరోగ్య శాఖలో కీలక విభాగాల నిర్వహణకు తగిన అధికారులను నియమించడంలో గందరగోళం నెలకొంది.
వరుస పదవీ విరమణలున్నా కొరవడిన ముందస్తు ప్రణాళక
పోస్టులున్నా తదుపరి స్థాయి పదోన్నతులను కల్పించని సర్కారు
తాజా పరిస్థితికి కొందరు విభాగాధిపతులే కారణం!
కీలక విభాగాధిపతుల పనితీరుపై సీఎం అసంతృప్తి
హైదరాబాద్, మార్చి 23(ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్య శాఖలో కీలక విభాగాల నిర్వహణకు తగిన అధికారులను నియమించడంలో గందరగోళం నెలకొంది. రానున్న 3 నెలల్లో వరుసగా ముఖ్యమైన విభాగాధిపతులంతా పదవీ విరమణ చేయనున్నారు. తదుపరి విభాగాధిపతులుగా నియమించేందుకు హెచ్‌వోడీ కార్యాలయాల్లో ఒక్క సీనియర్ అధికారైనా లేకపోవడమే ఇప్పుడు అసలైన సమస్య. తదుపరి స్థాయి పదోన్నతులు చేపట్టకపోవడంలో కొందరు విభాగాధిపతులు కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తగిన ముందస్తు ప్రణాళిక లేకపోవడం, నిబంధనలను ఉల్లంఘిస్తూ అవినీతికి పాల్పడడంలో నిమగ్నమై ఉండడంపై వైద్య వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కాగా తెలంగాణ వైద్యవిధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ మే నెలలో, వైద్యవిద్య సంచాలకుడు డాక్టర్ శివరాం ప్రసాద్ జూన్‌లో, డీఎంఈ డాక్టర్ నరేంద్రకుమార్ జులైలో రిటైర్ కాబోతున్నారు. ఇన్‌ఛార్జి ప్రజారోగ్య సంచాలకుడిగా ఉన్న రవీంద్రనాయక్ మరో 10నెలల్లో పదవీ విరమణ చేయబోతున్నారు. ఇటువంటి కీలక పోస్టుల్లో తదుపరి విభాగాధిపతులను నియమించాలంటే నిబంధనల మేరకు కొద్ది నెలల ముందే పదోన్నతులు చేపట్టాలి. సీనియారిటీ ప్రాతిపదికన ఓ జాబితాను రూపొందించి, అందులో అర్హులు, సమర్థులైన అధికారులకు హెచ్‌వోడీ పోస్టు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాల్సి ఉంది. ఇవేవీ జరగకపోవడంతో డీహెచ్, టీవీవీపీ, డీఎంఈ ఆఫీసుల్లో తదుపరి విభాగాధిపతులు ఎవరనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మరోవైపు కీలక విభాగాధిపతుల పనితీరుపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ, హెల్త్ సెక్రటరీ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి.