‘డెమో’ల దోపిడీకి అడ్డేది?
ABN , Publish Date - May 22 , 2026 | 04:36 AM
రాష్ట్రంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయాల్లో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ అండ్ మీడియా ఆఫీసర్లు(డెమోలు), డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ అండ్ మీడియా ఆఫీసర్ల...
ఏళ్లుగా డీఎంహెచ్‌వో ఆఫీసుల్లో పాగా
బదిలీల్లోనూ బయటకు వెళ్లకుండా పైరవీలు
డీఎంహెచ్‌వోగా ఎవరొచ్చినా.. పెత్తనం వీళ్లదే
ఆస్పత్రులకు అనుమతుల పేరిట వసూళ్ల పర్వం
హైదరాబాద్, మే 21 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయాల్లో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ అండ్ మీడియా ఆఫీసర్లు(డెమోలు), డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ అండ్ మీడియా ఆఫీసర్ల (డిప్యూటీ డెమోలు) దోపిడీ అడ్డూఅదుపు ఉండడం లేదు. ఏళ్లకేళ్లుగా వీళ్లు జిల్లాల్లోనే పాతుకుపోయి.. వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నారు. పేరుకు మీడియా ఆఫీసర్లే అయినా.. జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లపై పెత్తనమంతా వీరిదే. బదిలీల ఊసెత్తితే చాలు.. రాజకీయ పైరవీలు, ఉద్యోగ సంఘాల అండతో సీటు కదలకుండా చక్రం తిప్పుతున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో బదిలీల ప్రక్రియ మొదలైన నేపథ్యంలో.. చాలా కాలంగా ఒకే చోట పని చేస్తున్న డెమోలు, డిప్యూటీ డెమోలకు స్థానచలనం కల్పిస్తారా? లేక.. ఎప్పటిలాగే పాత సీట్ల వద్దే పాతుకుపోతారా? అన్న చర్చ జరుగుతోంది. ఉద్యోగ సంఘాల ముసుగులో కొందరు రిటెన్షన్ అవుతుండడంతో.. తమకు కీలక జిల్లాల్లో అవకాశం దక్కడం లేదని సహచర డెమోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల్లో పది మంది డెమోలు ఉండగా, మిగతా జిల్లాల్లో డిప్యూటీ డెమోలు ఉన్నారు. వాస్తవానికి ప్రజల్లో ఆరోగ్య పథకాలపై విస్తృతంగా అవగాహన కల్పించడమే డెమోల పని. కానీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్‌ల యాజమాన్యాలను నిబంధనల పేరుతో వేధించడం, షోకాజ్ నోటీసులు జారీ చేయడం, లక్షల్లో వసూలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. జిల్లాలో అర్హత లేని ఆర్‌ఎంపీలు, పీఎంపీలు నడిపే క్లినిక్‌లు, అనుమతి లేని స్కానింగ్ సెంటర్లు, ల్యాబ్‌ల నుంచి ప్రతీనెలా మామూళ్లు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాగా నడిచే క్లినిక్‌లకు నిబంధనలు అతిక్రమించారనే పేరుతో నోటీసులివ్వడం, సీజ్ చేస్తామని బెదిరించడం, ఆ తర్వాత పెద్దపెద్ద ఆస్పత్రులకు సదరు క్లినిక్‌ను అమ్మేలా చేయడంలో వీరు ముఖ్య పాత్ర పోషిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దారికిరాని ఆస్పత్రులపై రోగులతో ఫిర్యాదు చేయించి, సోషల్ మీడియాలో పెట్టడం, కొత్త రోగులు వెళ్లకుండా చేయడలో వీళ్లు ఆరితేరినట్లు విమర్శలున్నాయి. దీంతో జిల్లాల్లో డీఎంహెచ్‌వోల కంటే వీరే పవర్‌ఫుల్‌గా మారారు.