పది పాసయ్యారు..హెచ్‌ఎంతో కలిసి ఫ్లైట్ ఎక్కేశారు
ABN , Publish Date - Jun 01 , 2026 | 05:16 AM
పదో తరగతి పరీక్షల్లో 70 శాతానికి పైగా మార్కులు తెచ్చుకుంటే విమానంలో వేరే రాష్ట్రానికి తీసుకెళ్తా నంటూ విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఇచ్చిన .....
70శాతం మార్కులు సాధిస్తే విమానయానం చేయిస్తానని హామీ
మాట నిలబెట్టుకున్న జడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం మంజుల
వికారాబాద్, మే 31(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పదో తరగతి పరీక్షల్లో 70 శాతానికి పైగా మార్కులు తెచ్చుకుంటే విమానంలో వేరే రాష్ట్రానికి తీసుకెళ్తా నంటూ విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఇచ్చిన మాటను ఓ జడ్పీ పాఠశాల హెచ్‌ఎం నిలబెట్టుకున్నారు. నిర్దేశించిన ఫలితం సాధించిన ఇద్దరు విద్యార్థులను విమానంలో బెంగళూరు తీసుకెళ్లారు. వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలం, నారేగూడ జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో శివసాయి, నవీన్‌కుమార్ అనే ఇద్దరు విద్యార్థులే ఉన్నారు. వీరిద్దరిపట్ల పాఠశాల హెచ్‌ఎం జే మంజుల, ఉపాధ్యాయులు ప్రారంభం నుంచి ప్రత్యేక శ్రద్ధ చూపించారు. వార్షిక పరీక్షల్లో 70 శాతానికిపైగా మార్కులు సాధిస్తే తన సొంత ఖర్చులతో విమానంలో పక్క రాష్ట్రానికి తీసుకువెళతానని హెచ్‌ఎం మంజుల మాటిచ్చారు. పరీక్ష ఫలితాల్లో విద్యార్థులిద్దరూ 70శాతంపైగా మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. శివసాయికి 453, నవీన్‌కుమార్ 438 మార్కులు వచ్చాయి. దీంతో హెచ్‌ఎం మంజుల తన సొంత డబ్బుతో శివసాయి, నవీన్‌కుమార్‌ను మే 26న విమానంలో బెంగళూరుకు తీసుకువెళ్లారు. రెండురోజుల పాటు వారు విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ టెక్నాలజీ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మ్యూజియం, జవహర్‌లాల్ నెహ్రూ ప్లానిటోరియం తదితర ప్రదేశాలను సందర్శించారు.