ఉచిత పథకాలు ఇవ్వాలని ఉత్తర్వులిస్తే.. ఇక వ్యాజ్యాల వరదే : హైకోర్టు
ABN , Publish Date - Feb 24 , 2026 | 04:43 AM
తెలంగాణ సాధన ఉద్యమకారులమైన తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణను ముగించింది.
ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు, పింఛన్లపై దాఖలైన పిటిషన్‌పై విచారణ ముగింపు
హైదరాబాద్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సాధన ఉద్యమకారులమైన తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణను ముగించింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. ఇప్పటికే పిటిషనర్ల దరఖాస్తులు అందినందున ప్రభుత్వమే తగిన నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది. ఈ పిటిషన్లను ఆమోదిస్తే వరదలా దరఖాస్తులు వస్తునే ఉంటాయని తెలిపింది. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, రూ. 5లక్షల వరకు నిర్మాణ ఖర్చులు, రూ. 10 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఆ మేరకు దరఖాస్తు పెట్టినా స్పందన లేదని పేర్కొంటూ పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఉద్యమంలో న్యాయవాదులు పాల్గొన్నారని వారందరికీ పింఛన్లు, స్థలాలు ఇవ్వడం సాధ్యమా అని ప్రశ్నించింది. మిలియన్ మార్చ్‌లో లక్షల మంది పాల్గొన్నారని వారందరికీ ఇవన్నీ ఇవ్వడం సాధ్యం కాదని తెలిపింది. పిటిషనర్లకు అనుకూలంగా గనుక తీర్పు ఇస్తే.. ఇక వేల సంఖ్యలో పిటిషన్లు వరదలా వస్తాయని వ్యాఖ్యానించింది.