మునిసిపాలిటీల విలీనం రాజ్యాంగబద్ధమేనా?
ABN , Publish Date - Feb 17 , 2026 | 06:01 AM
హైదరాబాద్ శివారుల్లోని 27 మున్సిపాల్టీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసిన అంశం హైకోర్టు ముంగిటకు చేరింది.
అన్ని అంశాలను సరిచూసే విలీనం చేశారా?
ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న
కౌంటర్ దాఖలు చేస్తాం
ప్రస్తుత దశలో కోర్టులు
జోక్యం చేసుకోలేవు: సర్కారు
స్టే జారీకి కోర్టు నిరాకరణ
హైదరాబాద్, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ శివారుల్లోని 27 మున్సిపాల్టీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసిన అంశం హైకోర్టు ముంగిటకు చేరింది. వాటిని విలీనం చేస్తూ తెలంగాణ మున్సిపాల్టీల(సవరణ) చట్టం- 2026ను నోటిఫై చేసే ముందు అన్ని అంశాలను సరిచూశారా? అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాజ్యాంగంలోని 243 (క్యూ)(2)లో పేర్కొన్న జనాభా పరిమాణం, జనసాంద్రత, వ్యవసాయేతర ఉద్యోగిత శాతం, స్థానిక పరిపాలన వల్ల సమకూరే రెవెన్యూ, ఆర్థిక సామర్థ్యం తదితర అంశాలను పరిశీలించారా? అని అడిగింది. విలీనం రాజ్యాంగబద్ధంగానే జరిగిందా? అని ప్రశ్నించింది. శివారు మున్సిపాల్టీలను విలీనం చేస్తూ తీసుకొచ్చిన సవరణ చట్టాన్ని కొట్టేయాలని కోరుతూ తుక్కుగూడకు చెందిన ఆర్.లక్ష్మణ్, రాజమోని రాజు తదితరులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎల్. రవిచందర్ వాదిస్తూ విలీనం రాజ్యాంగబద్ధంగా జరగలేదని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 (క్యూ), 243(యూ)లోని నిబంధనలను ప్రభుత్వం పాటించలేదని పేర్కొన్నారు. విలీనంపై ఇప్పటికే చట్టం వచ్చినంత మాత్రాన రాజ్యాంగ వ్యతిరేక చర్యలు చట్టబద్ధమైపోవని తెలిపారు. గ్రామీణ లక్షణాలు ఉన్న ప్రాంతాలను కూడా కోర్ అర్బన్ ప్రాంతంలో కలపడం సరికాదన్నారు. అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి వాదిస్తూ.. మున్సిపాలిటీల విలీనాలు చట్టబద్ధమైపోయాయని, వాటిని అసెంబ్లీ చట్టాన్ని ఇప్పటికే ఆమోదించిందని పేర్కొన్నారు. ఆ చట్టం చేయడానికి రాష్ట్ర శాసనవ్యవస్థకు శాసనాధికారం ఉందా? లేదా? మాత్రమే చూడాలని, శాసనాధికారం ఉంది అనుకున్నప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని పేర్కొన్నారు. విలీనం చేసేముందు ఆర్టికల్ 243 (క్యూ)(2) ప్రకారం కసరత్తు జరిగిందా? లేదా? అన్న వివరాలను కౌంటర్‌లో తెలియజేస్తామని తెలిపారు.
విలీనం సంపూర్ణ చట్టంగా మారిన ప్రస్తుత దశలో జోక్యం చేసుకోరాదని పేర్కొన్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది సమాధానం ఇస్తూ.. అసెంబ్లీకి అధికారం ఉందా, లేదా అన్నది ఇక్కడ సమస్య కాదని, చేసిన చట్టం రాజ్యాంగ బద్ధమా, కాదా అన్నదే ముఖ్యమని తెలిపారు. త్వరలోనే జీహెచ్‌ఎంసీకి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ఉందని, ఎన్నికలను నిలిపేయడం తమ అభిమతం కాదని, అక్రమ విలీనం కొనసాగకూడదని పేర్కొన్నారు. స్టే ఇచ్చేందుకు నిరాకరించిన ధర్మాసనం 4వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.