Share News

మీ పని మీరు చేయాలని హైకోర్టు చెప్పాలా?

ABN , Publish Date - Jul 08 , 2026 | 06:59 AM

మీ పని మీరు చేయాలని హైకోర్టు చెప్పాలా ? అని రెవెన్యూశాఖ అధికారులను హైకోర్టు ప్రశ్నించింది ప్రజలకు రెవెన్యూ సర్వీసులు అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతోందని ఆక్షేపించింది.

మీ పని మీరు చేయాలని హైకోర్టు చెప్పాలా?

  • ప్రజలకు రెవెన్యూ సేవలు అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం

  • వాళ్లు నెలల తరబడి వేచి చూసినా పనులు కావటం లేదు

  • శాఖ పనితీరుపై హైకోర్టు ఫైర్‌

  • కౌంటర్‌ దాఖలు చేయలని

  • ముఖ్య కార్యదర్శికి ఆదేశం

హైదరాబాద్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి): మీ పని మీరు చేయాలని హైకోర్టు చెప్పాలా ? అని రెవెన్యూశాఖ అధికారులను హైకోర్టు ప్రశ్నించింది ప్రజలకు రెవెన్యూ సర్వీసులు అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతోందని ఆక్షేపించింది. పాస్‌ పుస్తకాలు, మ్యుటేషన్లు, భూముల సర్వే, రెవెన్యూ ఎంట్రీల్లో తప్పుల సవరణ తదితర పనుల కోసం ప్రజలు హైకోర్టుకు వస్తున్నారని గుర్తు చేసింది. ప్రజలకు రెవెన్యూ సేవలు అందించడంలో రెవెన్యూశాఖ అనుసరిస్తున్న ప్రామాణిక విధానం ఏమిటో కౌంటర్‌ ద్వారా వివరించాలని రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కౌంటర్‌ దాఖలుకు నాలుగువారాల గడువు ఇచ్చింది. తన 20 గుంటల భూమిని బోధన్‌ ఆర్డీవో, తహసీల్దార్‌ మ్యుటేషన్‌ చేయడం లేదని పేర్కొంటూ నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలం ఎరాజ్‌పల్లె గ్రామానికి చెందిన లోకనడిపి హనుమాండ్లు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా, రెవెన్యూ అధికారులు తమ విధుల్లో భాగంగా అందించాల్సిన సేవల కోసం ప్రజలు హైకోర్టు వరకు రావడంపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజలు అప్లికేషన్లు పెట్టుకుని నెలలు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో భూసర్వేలు చేపట్టకపోవడం, మ్యుటేషన్లు చేయకపోవడం, రెవెన్యూ ఎంట్రీల్లో తప్పులు సవరించకపోవడం, పాస్‌పుస్తకాలు జారీచేయకపోవడం వంటి ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొంది. ‘అధికారుల నిర్లక్ష్యం, పాలనాపరమైన జాప్యం వల్ల పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాస్‌పుస్తకాల జారీ కోసం మూడు నెలలు వేచి చూడాలా? భూసర్వే కోసం 6 నెలలు ఎదురుచూడాలా? రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి చివరికి హైకోర్టుకు వస్తున్నారు. రెవెన్యూ అధికారులు తగిన సమయంలో పని చేయకపోవడంతో కొందరు ఎమ్మెల్యేలతో చెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. రెవెన్యూ సేవలు అందించడానికి ఉమ్మడి ప్రామాణిక విధానం (ఎస్‌వోపీ) అంటూ ఏదీ లేదా?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై సమగ్ర నివేదిక అందజేయాలని రెవెన్యూ ముఖ్య కార్యదర్శిని ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Updated Date - Jul 08 , 2026 | 07:00 AM