Share News

వైద్య సేవలపై అసమగ్ర వివరాలిస్తారా ?

ABN , Publish Date - Apr 24 , 2026 | 04:20 AM

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలు అందించేందుకు ఉన్న మార్గదర్శకాలు, విధానాలు తెలియజేయమని కోరగా.. అసమగ్ర వివరాలతో ...

వైద్య సేవలపై అసమగ్ర వివరాలిస్తారా ?

  • ప్రతీ అంశానికి ప్రత్యేకంగా ఆదేశాలివ్వాలా..

  • ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసంతృప్తి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలు అందించేందుకు ఉన్న మార్గదర్శకాలు, విధానాలు తెలియజేయమని కోరగా.. అసమగ్ర వివరాలతో ప్రభుత్వం కౌంటరు దాఖలు చేయడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆధార్‌ కార్డు అవసరమా ? లేదా ? అనే అంశంపై మాత్రమే కౌంటరు దాఖలు చేయడమేంటని ప్రశ్నించింది. ప్రతి అంశానికి ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయాలా ? అని ప్రశ్నించింది. మహబూబాబాద్‌ జిల్లా చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తి కిడ్నీ, తదితర వ్యాధులకు చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి రాగా సహాయకుడు లేడని, ఆధార్‌ లేదని వైద్యం చేయడానికి నిరాకరించారు. దీంతో మూడు రోజులపాటు ఆస్పత్రి క్యాంటీన్‌ పరిసరాల్లో ఉండిపోయిన రవి స్పృహ తప్పి పడిపోయారు. రవి చనిపోయాడని భావించి మార్చురికీ తరలించగా.. అతను ప్రాణాలతోనే ఉన్నాడని మరుసటి రోజు స్వీపర్లు గుర్తించారు. వారిచ్చిన సమాచారం మేరకు పోలీసులు రవిని ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. ఈ అంశంపై కొమురయ్య అనే న్యాయవాది రాసిన లేఖను హైకోర్టు పిల్‌గా తీసుకుని విచారణ చేపట్టింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు వైద్యం అందించేందుకు ఎలాంటి మార్గదర్శకాలు ఉన్నాయో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం.. కౌంటర్‌ దాఖలుకు మరో అవకాశమిచ్చింది. గత ఆదేశాల మేరకు వైద్య సేవలపై సమగ్ర వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని స్పష్టం చేసింది. విచారణను 4వారాలకు వాయిదా వేసింది.

యాసంగిలో 4.26 లక్షల టన్నుల ధాన్యం సేకరణ

ఈ యాసంగి సీజన్‌లో ఇప్పటివరకు 4.26 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 4,543 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 47,623 మంది రైతులకు రూ. 102.42 కోట్ల కనీస మద్దతు ధర చెల్లించినట్లు తెలిపారు. నిజామాబాద్‌లో 2,04,010 టన్నులు, నల్లగొండలో 1,15,652 టన్నులు, సూర్యాపేటలో 51,207 టన్నులు కొనుగోలుచేసి తొలి మూడు స్థానాల్లో ఉన్నాయని స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు.

Updated Date - Apr 24 , 2026 | 04:20 AM