Share News

సినిమా టికెట్‌ ధరలు ఎలా పెంచుతారు?

ABN , Publish Date - Jun 11 , 2026 | 04:23 AM

సినిమా టికెట్ల ధరలను స్పష్టంగా నిర్ణయిస్తూ జారీ చేసిన జీవో 120 అమలులో ఉండగా మళ్లీ పెంచడం ఎందుకని హైకోర్టు రాష్ట్ర హోం శాఖను ప్రశ్నించింది.

సినిమా టికెట్‌ ధరలు ఎలా పెంచుతారు?

  • ‘పెద్ది’ టికెట్‌ రేట్ల పెంపుపై కోర్టు ధిక్కార పిటిషన్‌ విచారణలో హైకోర్టు

హైదరాబాద్‌, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): సినిమా టికెట్ల ధరలను స్పష్టంగా నిర్ణయిస్తూ జారీ చేసిన జీవో 120 అమలులో ఉండగా మళ్లీ పెంచడం ఎందుకని హైకోర్టు రాష్ట్ర హోం శాఖను ప్రశ్నించింది. తాము స్పష్టమైన ఆదేశాలిచ్చినా ధరలు పెంచుతూ మెమో జారీ చేయడంపై రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా టికెట్‌ ఽధరలు పెంచాలంటే 90 రోజుల ముందు పబ్లిక్‌లో పెట్టాలని, అభ్యంతరాలు స్వీకరించాలని ప్రొసీజర్‌ నిర్దేశించిన తర్వాత కూడా దాదాపు ఏడు మెమోలు జారీ చేశారని, హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఆంతర్యం ఏంటని ప్రశ్నించింది. కావాలంటే సినిమా థియేటర్లను వర్గీకరించి, టికెట్‌ ధరలను నిర్ణయించిన జీవో 120ని కోర్టులో సవాల్‌ చేయమని హోంశాఖ ముఖ్య కార్యదర్శికి చెప్పండని హోం శాఖ తరఫు న్యాయవాదికి సూచించింది. ధరలు పెంచబోమని హామీ ఇచ్చిన తర్వాత కూడా తదుపరి సినిమాలకు అదే పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘పెద్ది’ సినిమాకు టికెట్ల ధరలు పెంచుతూ ఇచ్చిన మెమోను సవాల్‌ చేస్తూ డీ చంద్రబాబు అనే వ్యక్తి హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టు ఉత్తర్వులున్నా ధిక్కరిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి మెమో జారీ చేశారని పేర్కొన్నారు. పదే పదే కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తున్నందున సదరు అధికారికి రూ.10 లక్షల జరిమానా విధించి లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీకి చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ఎన్‌వీ శ్రవణ్‌ కుమార్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. హోం శాఖ ముఖ్య కార్యదర్శి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది.

Updated Date - Jun 11 , 2026 | 04:23 AM