Share News

వారికి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాల్సిందేV

ABN , Publish Date - Apr 17 , 2026 | 04:09 AM

రాష్ట్రంలో 1-9-2004కు ముందు వెలువడ్డ నియామక నోటిఫికేషన్ల ద్వారా ఎంపికై.. ఆ తేదీ తర్వాత నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానం అమలు చేయాల్సిందేనని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది.

వారికి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాల్సిందేV

  • లేదంటే కోర్టు ధిక్కార కేసు ఎదుర్కోవాల్సి ఉంటుంది

  • జూన్‌ 10వ తేదీలోపు అమలు చేయకపోతే.. అదే రోజు మా ముందు హాజరు కండి

  • న్యాయ, ఆర్థిక శాఖ కార్యదర్శులకు హైకోర్ట్‌ ఆదేశం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 1-9-2004కు ముందు వెలువడ్డ నియామక నోటిఫికేషన్ల ద్వారా ఎంపికై.. ఆ తేదీ తర్వాత నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానం అమలు చేయాల్సిందేనని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. లేని పక్షంలో అధికారులు కోర్టు ధిక్కార కేసును ఎదుర్కోవాల్సి ఉంటుందని.. జస్టిస్‌ సామ్‌కోషి, జస్టిస్‌ నందికొండ నర్సింగ్‌రావులతో కూడిన ధర్మాసనం గురువారం హెచ్చరించింది. ఈ తీర్పును జూన్‌ 10లోపు అమలుచేయాలని, అలా చేయలేకపోతే అదే రోజు (జూన్‌ 10న) కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని న్యాయశాఖ కార్యదర్శి పాపిరెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్‌ సుల్తానియాలను ఆదేశించింది. న్యాయశాఖలోని ఉద్యోగులు దాఖలు చేసిన కేసులో న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది. మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, సీబీఐ కోర్టులతో పాటు రంగారెడ్డి జిల్లా కోర్టుల్లో 65 మంది ఉద్యోగుల తరపున హైకోర్టు న్యాయవాదులు వి.రాజశేఖర్‌రెడ్డి, ఎన్‌.లావణ్య ఈ కేసు దాఖలు చేశారు. 1-9-2004కు ముందు నియామక నోటిఫికేషన్లన్నీ కూడా పాత పెన్షన్‌ విధానం వర్తింపు కిందే జారీ అయ్యాయని.. 2004 సెప్టెంబరు 1 తర్వాత నియామకాలన్నీ కంట్రీబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌(సీపీఎస్)కింద జరిగాయని.. పాత పెన్షన్‌ అమలులో ఉన్న సమయంలోనే తాము ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం, నియామక ప్రక్రియ అంతా పూర్తయిందని ఉద్యోగులు వాదిస్తున్నారు. న్యాయశాఖలోని 65 మందే కాకుండా... రాష్ట్రవ్యాప్తంగా జెన్‌కో, ట్రాన్స్‌కోతో పాటు డిస్కమ్‌లతో పాటు వివిధ శాఖల్లో ఇలా 13 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా వీరందరికీ పాత పెన్షన్‌ విధానం అమలు చేయడానికి వీలుగా గతంలోనే ఉత్తర్వులు కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హైకోర్టు ఉత్తర్వులతో న్యాయశాఖలోని 65 మందితో పాటు వివిధ శాఖల్లోని 13 వేల మందికి పాత పెన్షన్‌ విధానం అమలుకు మార్గం సుగమమైంది.

Updated Date - Apr 17 , 2026 | 04:09 AM