Share News

బదిలీ అయినా బాధ్యత మీదే

ABN , Publish Date - Jan 28 , 2026 | 04:20 AM

వివిధ ప్రాజెక్టుల కోసం ఎప్పుడో దశాబ్దాల కిందట చేసిన భూసేకరణకు ఇప్పటికీ పరిహారం చెల్లించడానికి నిధులు లేకపోతే కొత్త ప్రాజెక్టులు ఎందుకని మంగళవారం హైకోర్టు ప్రశ్నించింది.

బదిలీ అయినా బాధ్యత మీదే

  • పరిహారం చెల్లించనందుకు ప్రత్యక్షంగా హాజరుకండి

  • ఐఏఎ్‌సలు నవీన్‌ మిట్టల్‌, సంజయ్‌ ఝాలకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): వివిధ ప్రాజెక్టుల కోసం ఎప్పుడో దశాబ్దాల కిందట చేసిన భూసేకరణకు ఇప్పటికీ పరిహారం చెల్లించడానికి నిధులు లేకపోతే కొత్త ప్రాజెక్టులు ఎందుకని మంగళవారం హైకోర్టు ప్రశ్నించింది. భూసేకరణ పరిహారం చెల్లించాలంటూ దిగువ కోర్టుల్లో దాదాపు 5వేలకు పైగా ఎగ్జిక్యూటివ్‌ పిటిషన్‌ (ఈపీ)లు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేసింది. తాము బదిలీ అయినందున పరిహారం చెల్లింపులో తమకు బాధ్యత లేదంటూ ఐఏఎస్‌ అధికారులు చేసిన వాదనను తిరస్కరించింది. బదిలీ అయినంత మాత్రాన బాధ్యతల నుంచి తప్పించుకోలేరని, ప్రత్యక్షంగా తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మిడ్‌ మానేరు ప్రాజెక్టు కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కుదురుపాక గ్రామానికి చెందిన 74 ఏళ్ల బొమ్మన మల్లవ్వకు చెందిన 14 గుంటల భూమిని, ఇంటి జాగాను ప్రభుత్వం సేకరించింది. 2010లో తీసుకున్నప్పటికీ ఇప్పటికీ భూసేకరణ ప్రొసీడింగ్స్‌ను అధికారులు పూర్తిచేయలేదు. పరిహారం అందజేయలేదు. పరిహారం కోసం ఆ వృద్ధురాలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా, మూడునెలల్లో భూసేకరణ అవార్డు ప్రొసీడింగ్స్‌ పూర్తిచేసి పరిహారం ఇవ్వాలని హైకోర్టు 2024లో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు అమలుకాకపోవడంతో ఆమె మళ్లీ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై డిసెంబరులో విచారణ చేపట్టిన జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం.. అప్పటి రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌మిట్టల్‌, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝాలకు ఫారం-1 నోటీసులు జారీచేసి, ప్రత్యక్షంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. తాము ఆ పోస్టుల నుంచి బదిలీ అయ్యామని, ప్రస్తుతం తమకు సంబంధం లేదంటూ వారు తాజాగా సమాధానం ఇవ్వగా దానితో ఏకీభవించలేదు. మార్చి 24న తమ ఎదుట హాజరుకావాలని ఽస్పష్టంచేసింది. 8 వారాల్లో భూసేకరణ ప్రొసీడింగ్స్‌ పూర్తిచేసి పరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది.

Updated Date - Jan 28 , 2026 | 04:20 AM