స్పీకర్‌కు, దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు
ABN , Publish Date - Mar 24 , 2026 | 05:27 AM
మ్మెల్యే పదవికి దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం..
ఎమ్మెల్యే పదవికి దానం అనర్హుడంటూ బీజేపీ ఎల్పీ నేత ఏలేటి పిటిషన్
స్పీకర్ తీర్పు న్యాయ సమీక్షలో నిలవదు
ధర్మాసనం ఎదుట మహేశ్వర్‌రెడ్డి తరఫున వాదనలు
వివరణ ఇవ్వాలంటూ ఇద్దరికీ నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం
హైదరాబాద్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే పదవికి దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం.. శాసససభ స్పీకర్‌కు, దానం నాగేందర్‌కు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఏలేటి పిటిషన్‌పై విచారణ జరిపింది. ఏలేటి తరఫున సీనియర్ న్యాయవాది వివేక్‌రెడ్డి వాదనలు వినిపించారు. దానం నాగేందర్ బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీ బీఫాం తో ఎంపీగా పోటీ చేశారని.. ఆయన కాంగ్రెస్ నుంచి నామినేషన్ వేసిన నాటి నుంచే ఎమ్మెల్యేగా అనర్హుడి గా మారారన్నారు. ఒక పార్టీ ప్రజాప్రతినిధిగా ఉండి మరో పార్టీ బీఫాంపై పోటీ చేస్తే స్వచ్ఛందంగా పదవి వదులుకున్నట్లేనని సుప్రీంకోర్టు ‘డాక్టర్ మహాచంద్ర ప్రసాద్ వర్సెస్ చైర్మన్, బిహార్ శాసన మండలి’ తీర్పులో స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ఇదే హైకోర్టు ‘భూపతిరెడ్డి’ కేసులో ఇచ్చిన తీర్పు సైతం ఉదాహరణగా నిలుస్తుందన్నారు. దానం సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి.. తన సొంత పార్టీ అయిన బీఆర్‌ఎ్‌సకు వ్యతిరేకంగా ప్రచారం చేశారని, దీనికి అన్ని ఆధారాలను స్పీకర్‌కు సమర్పించామని తెలిపారు. అయితే, తాను సభలో చోటుచేసుకున్నవే పరిగణనలోకి తీసుకుంటానని స్పీకర్ తీర్పులో చెప్పారని, ఈ తీర్పు న్యాయసమీక్షలో నిలువదన్నారు. దానం అనర్హుడు కాదంటూ స్పీకర్ ఇచ్చిన తీర్పును కొట్టేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత శాసనసభ పదవీకాలం ఇప్పటికే రెండున్నరేళ్లు పూర్తయిందని.. దీన్ని దృష్టిలో ఉంచుకుని త్వరగా విచారణ చేపట్టాలని హైకోర్టును కోరారు.
ఏ హోదాలో మీరు వాదిస్తున్నారు?
వాదనలు విన్న ధర్మాసనం.. మొదటి ప్రతివాది స్పీకర్, రెండో ప్రతివాది అయిన దానం తరఫున ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారని ప్రశ్నించింది. దానం తరఫున ఎవరూ హాజరుకాలేదు. స్పీకర్ తరఫున తాను హాజరవుతున్నట్లు అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పంది స్తూ.. ‘మీరు అడ్వకేట్ జనరల్ హోదాలో స్పీకర్ తరఫున హాజరవుతున్నారా? లేక.. ఒక సీనియర్ న్యాయవాదిగా మిమ్మల్ని నియమించుకున్నారా?’అని ప్రశ్నించింది. తాను సీనియర్ న్యాయవాదిగానే స్పీకర్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నానని సుదర్శన్‌రెడ్డి తెలిపారు. స్పీకర్ ఒక ట్రిబ్యునల్ అని.. స్పీకర్ కౌంటర్ దాఖలు చేయాల్సిన అవసరం లేదని సుదర్శన్‌రెడ్డి పేర్కొనగా.. పిటిషనర్ న్యాయవాది వివేక్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ.. గత కేసుల్లో స్పీకర్ కౌంటర్ దాఖలు చేశారని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం స్పీకర్‌కు, దానం నాగేందర్‌కు నోటీసులు జారీ చేసింది. విచారణను ఏప్రిల్ 16కు వాయిదా వేసింది.