ఇంటి నిర్మాణంలో ఆలస్యం పన్ను చెల్లింపుదారుని తప్పుకాదు : హైకోర్టు
ABN , Publish Date - Aug 05 , 2026 | 05:49 AM
ఒప్పందం ప్రకారం గడువులోపు పూర్తికావాల్సిన ఇంటి నిర్మాణం ఆలస్యమయి, సరైన సమయానికి ఇంటి యాజమాన్య హక్కులు లభించకపోవడం పన్నుచెల్లింపుదారు తప్పుకాదని హైకోర్టు పేర్కొంది.
హైదరాబాద్, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): ఒప్పందం ప్రకారం గడువులోపు పూర్తికావాల్సిన ఇంటి నిర్మాణం ఆలస్యమయి, సరైన సమయానికి ఇంటి యాజమాన్య హక్కులు లభించకపోవడం పన్నుచెల్లింపుదారు తప్పుకాదని హైకోర్టు పేర్కొంది. గడువులోపు ఇంటి యాజమాన్య హక్కులు లభించకపోయినా ఇన్‌కం ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 54 (ఎఫ్) కింద దీర్ఘకాల మూలధన లాభాల పన్ను మినహాయింపు లభిస్తుందని స్పష్టంచేసింది. మెట్టు సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తికి షేర్లు, బంగారం, భూమి వంటి ఆస్తుల అమ్మకం ద్వారా దాదాపు రూ. 64 లక్షల మేర దీర్ఘకాల మూలధన లాభాలు వచ్చాయి. ఇన్‌కంట్యాక్స్ చట్టం సెక్షన్ 54 (ఎఫ్) ప్రకారం ఈ మూలఽధన లాభాలతో మూడేళ్లలో కొత్త ఇంటిని నిర్మించుకుంటే ఆ లాభానికి పన్ను మినహాయింపు లభిస్తుంది. ఆయన సైతం ఈ మూలధన లాభంతో ఇల్లు కొనేందుకు బిల్డర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ సకాలంలో ఇంటిపై హక్కు లభించకపోవడంతో మూలఽధన లాభాల పన్ను మినహాయింపు వర్తించదని ఆదాయపు పన్ను అధికారులు నోటీసులు ఇచ్చారు. దీనిపై ఇన్‌కంట్యాక్స్ అప్పీలేట్ ట్రైబ్యునల్‌కు వెళ్లినప్పటికీ ఊరట లభించలేదు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన జస్టిస్ శ్యాంకోషీ, జస్టిస్ నర్సింగ్‌రావుల ధర్మాసనం.. అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఒప్పందం ప్రకారం గడువులోపు ఇంటి నిర్మాణం పూర్తికాకపోతే పన్నుచెల్లింపుదారు తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించింది. ఆయనకు మూలధన లాభాల పన్ను మినహాయింపు ఇవ్వాలని ఆదేశించింది.