సెలెక్ట్ కమిటీకి ‘విద్వేష’ బిల్లు
ABN , Publish Date - Mar 31 , 2026 | 05:34 AM
సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా చేసే ద్వేషపూరిత ప్రసంగాలు, నేరాలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ....
విద్వేష ప్రసంగపు నివారణ బిల్లుపై ప్రతిపక్షాల తీవ్ర అభ్యంతరం.. అధికార పక్షంలోనూ కొందరి వ్యతిరేకత
సెలెక్ట్ కమిటీకి పంపాలని స్పీకర్ నిర్ణయం
కక్షసాధింపుననకు బిల్లు తేలేదు..
విద్వేష ప్రసంగాల నియంత్రణకే: పొన్నం
స్వేచ్ఛను హరించడమే: ఏలేటి
ఉన్న చట్టాలు చాలు: కూనంనేని
హైదరాబాద్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా చేసే ద్వేషపూరిత ప్రసంగాలు, నేరాలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘హేట్ స్పీచ్ బిల్లు’పై ప్రతిపక్షాలతోపాటు అధికార పక్షంలోని కొందరు సభ్యుల నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ద్వేషపూరిత ప్రసంగం అనేదానికి బిల్లులో సరైన నిర్వచనం లేదని, దీనిని రాజకీయ కక్షసాధింపులకు వాడుకునే ప్రమాదం ఉందని పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. ఈ బిల్లును సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపించాలని సభ్యులు పార్టీలకతీతంగా ప్రతిపాదించారు. దీంతో బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లు స్పీకర్ ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. సోమవారం శాసనసభలో ‘తెలంగాణ విద్వేషపూరిత ప్రసంగం, ద్వేషపూరిత నేరాల నివారణ బిల్లు-2026’ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టారు. దీనిపై సభ్యుల అభ్యంతరాల అనంతరం ఆయన మాట్లాడుతూ.. బిల్లును కొందరు సభ్యులు స్వాగతించారని, మరికొంత మంది అభ్యంతరం తెలిపారని చెప్పారు. వాక్ స్వాతంత్ర్యాన్ని అణచివేసేందుకు ఈ బిల్లు తెస్తున్నామనడంలో వాస్తవం లేదన్నారు. ఆర్టికల్ 19(1)(ఎ)లో రీజనబుల్, రిస్ర్టిక్షన్ అనే పదాలు ఉన్నాయని తెలిపారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకే ఈ బిల్లు తీసుకొస్తున్నామని చెప్పారు. ఆధారాల్లేకుండా ఎవరిపైనా చర్యలు ఉండవని పేర్కొన్నారు. రాజకీయ కక్షసాధింపు కోసం ఈ బిల్లు తేవడం లేదని, పౌరహక్కులకు భంగం కలగకుండా చూసేందుకు తెస్తున్నామని స్పష్టం చేశారు.
నేరాల వ్యాప్తిని అరికట్టడానికే..
సమాజంలో ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం, సంఘాలపై విరోధం, ద్వేషం కలిగించేలా ద్వేషపూరితమైన ప్రసంగం చేయడాన్ని, నేరాల వ్యాప్తిని ప్రోత్సహించడాన్ని అరికట్టడానికి, ఆ నేరాలకు శిక్ష విధించడానికి, బాధితులకు తగిన పరిహారం చెల్లించడానికి ఈ బిల్లు తెచ్చామని మంత్రి పొన్నం వివరించారు. ఒకసారి నేరం చేస్తే ఏడాదికి తగ్గకుండా గరిష్ఠంగా ఏడేళ్ల జైలుశిక్షతోపాటు రూ.50 వేల జరిమానా, రెండోసారి పునరావృత్తమైతే రెండేళ్లకు తగ్గకుండా గరిష్ఠంగా పదేళ్ల జైలుశిక్ష, రూ.లక్ష జరిమానా ఉంటుందని చెప్పారు. దీనిపై సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వారి అభిప్రాయం మేరకు బిల్లును సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపాలని స్పీకర్‌ను కోరారు. దీంతో బిల్లుపై లోతైన అధ్యయనం కోసం సెలెక్ట్ కమిటీకి సిఫారసు చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అంతకుముందు బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకొచ్చిన హేట్ స్పీచ్ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్-19 ద్వారా కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను హరించేలా, సామాన్యులపై కక్ష సాధించేలా, విద్వేషపు ధోరణితో ఉందన్నారు. ఇది పాలకులు చేసిన తప్పును ఎత్తిచూపే అవకాశఽం లేకుండా చేయడమేనని ఆరోపించారు. నేరం చేయలేదని రుజువు చేసుకునే హక్కు కూడా బాధితులకు లేకుండా పోతుందన్నారు. ‘‘రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికే ఈ బిల్లు ఉంది. మీరు (కాంగ్రెస్) శాశ్వతంగా అధికారంలో ఉండరు. మీరు దిగిపోతే ఈ బిల్లును మీపైనే ప్రయోగించే అవకాశం ఉంటుంది. దీనిపై హౌస్ కమిటీ వేయాలి’’ మహేశ్వర్‌రెడ్డి అన్నారు. బిల్లులోని సెక్షన్-3 ప్రమాదకరమైందని, ఒక వాట్సాప్ గ్రూప్‌లో అడ్మిన్ పోస్టు పెడితే.. గ్రూపులోని సభ్యులందరినీ బాధ్యులను చేయడమేంటని ప్రశ్నించారు. ‘‘అధికారంలో ఉన్నప్పుడు అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఇప్పుడు మీరు తెచ్చే బిల్లు.. రేపు ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు మిమ్మల్ని భయపెట్టవచ్చు. సామాజిక మాధ్యమాలపై అతి నియంత్రణ మంచిది కాదు’’ అని బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్ అన్నారు. ప్రభుత్వం ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరారు.
భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం..
హేట్ స్పీచ్ బిల్లు భావప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించేవిధంగా ఉందని, బిల్లులో చాలా లోపాలున్నాయని మజ్లిస్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ బలాల అన్నారు. ఒక దేవుడిపై మరో దేవుడిని నమ్మేవాళ్లు విమర్శలు చేసినంత మాత్రాన కే సులు పెట్టాలనుకోవడం తప్పు అని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఉన్న చట్టాలు చాలునని, కొత్తగా చట్టాలు అవసరం లేదని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. దేశంలో విద్వేష ప్రసంగాలు పెరుగుతున్నాయని, వీటిని సుమోటోగా స్వీకరించి నియంత్రించాలని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యశస్విని రెడ్డి, నాగరాజు, శంకర్, రాగమయి, శ్రీగణేష్, శంకరయ్య తదితరులు ఈ బిల్లును కఠినంగా అమలు చేయాలని కోరారు.
ప్రజాస్వామ్య గొంతుకను నొక్కేందుకే: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ (ప్రివెన్షన్) బిల్లును ప్రజాస్వామ్యం గొంతు నొక్కేందుకే తెచ్చిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రకటనలో ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే విపక్ష నేతలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలను లక్ష్యంగా చేసుకునేందుకే ఈ పదజాలాన్ని పొందుపరిచారని ఆరోపించారు.