కఠినంగానే ‘హేట్ స్పీచ్’ బిల్లు!
ABN , Publish Date - Mar 31 , 2026 | 05:37 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘తెలంగాణ విద్వేషపూరిత ప్రసంగం, ద్వేషపూరిత నేరాల నివారణ బిల్లు-2026’ అత్యంత కఠినంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
విద్వేష వ్యాఖ్యలు చేసే సభ్యుడే కాదు.. సంఘం నాయకుడు కూడా బాధ్యుడే
సంస్థపై కూడా చర్యలు తీసుకుంటారు
రిజిస్టర్ కాకున్నా సంఘంపై చర్యలు
హైదరాబాద్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘తెలంగాణ విద్వేషపూరిత ప్రసంగం, ద్వేషపూరిత నేరాల నివారణ బిల్లు-2026’ అత్యంత కఠినంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక సంఘంలో సభ్యుడు విద్వేష ప్రసంగం చేసినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడినా.. ఆ సభ్యుడే కాకుండా సదరు సంఘం నేత కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆ సంస్థ లేదా సంఘం రిజిస్టర్ అయినా, కాకున్నా సంఘంపై చర్యలు తీసుకోవాలని ఈ బిల్లు చెబుతోంది. సోమవారం శాసనసభలో దీనిని ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. అన్ని పార్టీల సభ్యుల వ్యతిరేకించడంతో సెలెక్ట్ కమిటీకి పంపించింది.
ఈ బిల్లులో ఏముందంటే..
ద్వేషపూరితమైన నేరానికి ఏడాదికి తక్కువ కాకుండా గరిష్ఠంగా ఏడేళ్లపాటు జైలుశిక్షతో పాటు రూ.50 వేల జరిమానా.
నేరం పునారవృత్తమైతే రెండేళ్లకు తక్కువ కాకుండా గరిష్ఠంగా పదేళ్ల జైలుశిక్ష, రూ.లక్ష జరిమానా.
విద్వేషపు ప్రసంగం వల్ల బాధితులకు భౌతికంగా లేదా ఆర్థికంగా జరిగిన నష్టం తీవ్రతను అంచనా వేసి, పరిహారం చెల్లింపు.
ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఈ కేసుల్లో విచారణ చేస్తారు. బెయిల్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.
ఒక కార్యనిర్వహక మెజిస్ట్రేట్ (మండల స్థాయిలో తహసీల్దార్, డివిజన్ స్థాయిలో ఆర్డీవో, జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్(రెవెన్యూ) లేదా కలెక్టర్), ప్రత్యేక కార్యనిర్వాహక మెజిస్ట్రేట్.. ఈ చట్టం కింద స్థానికంగా మళ్లీ మళ్లీ నేరాలు చేసేవాడు ఏదైనా నేరం చేయడానికి అవకాశం ఉన్న, లేక బెదిరించడానికి అవకాశం ఉంటే విచారణ జరిపి.. శాంతిని నెలకొల్పడానికి ఆ నేరస్తుడిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
ఎవ రైనా వ్యక్తి తనకు తెలియకుండా నేరం జరిగిందని లేక ఆ నేరం జరుగకుండా నివారించడానికి తాను తగినంత జాగ్రత్త తీసుకున్నారని నిరూపించుకుంటే ఆ వ్యక్తిని శిక్షించడానికి వీల్లేదు.
రాష్ట్రప్రభుత్వం ఈ చట్టం కింద నియమించే అధికారికి.. ఎలకా్ట్రనిక్ మీడియాలో లేదా ఏదేని సంస్థలో విద్వేష పూరిత ప్రసంగం తాలూకు ప్రకటన ఉన్నా... ప్రసారం అయినదాన్ని తొలగించాలని ఆదే శించే అధికారం ఉంటుంది.
ఈ చట్టం కింద నియమితులైన అధికారులు తీసుకునే చర్యలకు వ్యతిరేకంగా, ఆ అధికారిపై ఎటువంటి కేసు గానీ, విచారణ నిమిత్తం న్యాయపర మైన చర్యలు తీసుకోవడానికిగానీ వీల్లేదు.
వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ ఒక విద్వేష పోస్టు పెడితే... ఆ గ్రూపులోని సభ్యులంతా బాధ్యులే.