Share News

తెలంగాణ హస్తకళలకు గొప్ప వైభవం

ABN , Publish Date - Jul 04 , 2026 | 06:37 AM

గోల్కొండ హస్తకళా ఉత్పత్తులకు ఎనలేని ఆదరణ లభిస్తోంది. ఇక్కడి కళాకారుల చేతిలో ప్రాణం పోసుకున్న అందమైన వస్తువులకు దేశ విదేశాల నుంచి డిమాండ్‌ వచ్చి పడుతోంది.

తెలంగాణ హస్తకళలకు గొప్ప వైభవం

  • ‘గోల్కొండ’ బ్రాండ్‌పై జోరుగా అమ్మకాలు.. కళాకృతులకు దేశ, విదేశాల నుంచి ఆదరణ

  • ప్రముఖ నగరాలు, విమానాశ్రయాల్లో షోరూమ్‌లు

  • 2025-26లో 106 కోట్ల విక్రయాలపై రూ.32 కోట్ల లాభం

  • తొలిసారి ఉద్యోగులకు బోనస్‌

  • ఎస్సీ, ఎస్టీ, బీసీ కళాకారులకు చేయూత

  • 5 లక్షల మంది హస్త కళాకారులకు ఉపాధి

హైదరాబాద్‌, జులై 3 (ఆంధ్రజ్యోతి): గోల్కొండ హస్తకళా ఉత్పత్తులకు ఎనలేని ఆదరణ లభిస్తోంది. ఇక్కడి కళాకారుల చేతిలో ప్రాణం పోసుకున్న అందమైన వస్తువులకు దేశ విదేశాల నుంచి డిమాండ్‌ వచ్చి పడుతోంది. ఒకప్పుడు 2 లక్షల మంది కళాకారులకే చేతినిండా పనిలేని పరిస్థితుల నుంచి, నేడు 5 లక్షల మందికి ఉపాధి కల్పించే స్థాయికి గోల్కొండ బ్రాండ్‌ ఎదిగింది. కళాకారులు తయారు చేస్తున్న స్వర్ణ, రజత, కాంస్య, ఇతర లోహ కళాఖండాలు, నిర్మల్‌ చెక్క బొమ్మలు, కళాత్మక వస్త్రాలు, శిల్పాలు, తివాచీలు, బంజారా ఎంబ్రాయిడరీ దుస్తులు, వెండి ఫిలిగ్రీలు విరివిగా అమ్ముడుపోతున్నాయి. రాష్ట్ర హస్త కళల అభివృద్ధి సంస్థ విశేష కృషి ఫలితంగా ‘గోల్కొండ’ బ్రాండ్‌ గొప్ప వైభవం సంతరించుకుంటోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన చేతివృత్తుల కళాకారులకు చేతినిండా పని దొరుకుతోంది. ఫలితంగా గత నష్టాలకు గుడ్‌బై చెప్పి, 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.106 కోట్ల అమ్మకాలపై ఏకంగా రూ.32.52 కోట్ల లాభాలను నమోదు చేసి చరిత్ర సృష్టించింది. 2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరాల్లో రూ.5.82 కోట్ల నష్టాలను చవిచూడడం గమనార్హం. హస్తకళల అభివృద్ధి సంస్థ రాష్ట్రంలోని 11 నగరాలతోపాటు, ఢిల్లీ, కోల్‌కతాలో కలిపి ‘గోల్కొండ’ బ్రాండ్‌ పేరుతో 13 షోరూముల్లో ఈ ఉత్పత్తులను ప్రస్తుతం విక్రయిస్తోంది. శిల్పారామంలోనూ పెద్దఎత్తున అమ్మకాలు నమోదవుతున్నాయి.


ఏటా హస్తకళల ప్రదర్శనలు, మేళాలు నిర్వహిస్తున్నారు. ఈ- కామర్స్‌ వేదికగా విక్రయాలు చేపడుతున్నారు. నిర్మల్‌, సంగారెడ్డి, నల్లగొండ, కరీనంగర్‌ జిల్లాల్లో నాలుగు కామన్‌ ఫెసిలిటీ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వరంగల్‌లో గొల్కొండ షోరూమ్‌ నిర్మాణం జరుగుతోంది. పెంబర్తి, అశ్వారావుపేట సహా 10 క్లస్టర్లలో సెంటర్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యంగా తెలంగాణ హస్తకళలను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి విస్తరించాలని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్‌, కోల్‌కతా, ఢిల్లీ, ముంబై, బెంగళూరు విమానాశ్రయాల్లో ‘గోల్కొండ’ షోరూమ్‌లు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలను రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. హస్తకళల అభివృద్ధి సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2026- 27) రూ. 143 కోట్ల విక్రయాలను లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2030 నాటికి రూ. 500 కోట్లకు అమ్మకాలు పెంచుకోవాలన్న సంకల్పంతో ఉంది. తెలుగు రాష్ట్రా ల నుంచే కాకుండా, దేశంలోని ఇతర రాష్ట్రాలతోపాటు అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, కెనడా, దుబాయి దేశాలకు చెందిన టూరిస్టులు ‘గోల్కొండ’ ఉత్పతులను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు.


బోన్‌సలు.. 1వ తేదీలోపే వేతనం

తెలంగాణ హస్తకళలకు ఆదరణ వస్తుండడంతో కళాకారుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. సంస్థ చరిత్రలోనే తొలిసారి రూ.50 వేల చొప్పున కళాకారులకు బోనస్‌ ఇవ్వటం విశేషం. 60 ఏళ్లు దాటినవారికి నెలకు రూ.1,000 పింఛను ఇస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో 5 నెలల వేతనాలు పెండింగ్‌లో ఉంటే... రేవంత్‌ సర్కారు వచ్చిన తర్వాత అప్పు తెచ్చి ఉద్యోగుల వేతనాలు చెల్లించారు. ఇప్పుడు లాభాల బాట పట్టడంతో... నెల చివరి రోజునే ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమ అవుతున్నాయి.

మరో 5 లక్షల మందిని తయారుచేస్తాం

‘‘ప్రస్తుతం 5 లక్షల మంది కళాకారులు పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరో 5 లక్షల మంది కళాకారులకు శిక్షణ ఇచ్చి, మొత్తం 10 లక్షల మంది కళాకారులతో ఉత్పత్తులు తయారు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలు, కోయ- గిరిజనులకు ఉపాధి కల్పించి, ఆర్థికంగా ప్రోత్సహించాలనేది మా లక్ష్యం. తెలంగాణ సంస్కృతిని పరిరక్షించాలని, ఇక్కడి కళాకృతులను విదేశాలకు ఎగుమతి చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం. సీఎం రేవంత్‌,మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రోత్సాహంతో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ రికార్డు స్థాయిలో అమ్మకాలను సాధిస్తోంది.

- రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ నాయుడు సత్యనారాయణ

Updated Date - Jul 04 , 2026 | 06:38 AM