‘హ్యామ్’ టెండర్లకు మరో అడ్డంకి!
ABN , Publish Date - May 04 , 2026 | 04:46 AM
రాష్ట్రంలో హైబ్రిడ్ యాన్యుయిటీ మోడ్ (హ్యామ్) విధానంలో చేపట్టబోయే రోడ్ల పనుల వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. కొద్ది రోజులుగా ప్రతిపక్ష బీఆర్‌ఎస్...
రాజకీయ రంగు పులుముకున్న అధిక ధరల అంశం
దీనిపై ప్రభుత్వానికి నేడు అధికారుల నివేదిక
పలు రాష్ట్రాల్లో ‘ఎక్సెస్ కాస్ట్’ ఇచ్చిన అంశం ప్రస్తావన!
హైదరాబాద్, మే 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో హైబ్రిడ్ యాన్యుయిటీ మోడ్ (హ్యామ్) విధానంలో చేపట్టబోయే రోడ్ల పనుల వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. కొద్ది రోజులుగా ప్రతిపక్ష బీఆర్‌ఎస్, అధికార కాంగ్రెస్ మధ్య హ్యామ్ టెండర్లపై మాటల యుద్ధం నడుస్తోంది. ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖల్లో కలిపి హ్యామ్ రోడ్ల బడ్జెట్ దాదాపు రూ.18 వేల కోట్లకు చేరింది. ఈ పనుల కోసం పిలిచిన టెండర్లు, అధిక రేట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఆర్ అండ్ బీలో పూర్తయిన టెండర్ల ప్రక్రియలో భారీ స్కామ్ జరుగుతోందని, దాదాపు 25 శాతం అధిక ధరలకు కొంతమందికే పనులు కట్టబెట్టేందుకు చక్రం తిప్పుతున్నారంటూ బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు ఆరోపిస్తున్నారు. ఎక్సెస్ ఇవ్వడంలేదని, వాస్తవ ధరలు, నిర్ణయించిన పనులకు అయ్యే ఖర్చులను మాత్రం కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సి ఉంటుందని అధికార కాంగ్రెస్‌తో పాటు, ప్రభుత్వం కూడా చెబుతోంది. కాగా, ప్రభుత్వం పెట్టిన నిబంధన ప్రకారం 15 ఏళ్ల పాటు రహదారి నిర్వహణ, ప్రతీ 70 కిలోమీటర్లకు ఒక అంబులెన్స్ సౌకర్యం, మొదటగా చెల్లించే 10 శాతం మొబిలిటీ అడ్వాన్స్, ఇతర బిల్లుల చెల్లింపులకు కాంట్రాకర్లు దాదాపు 18శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే హ్యామ్ పనులు చేపట్టే కంపెనీకి ప్రస్తుత టెండర్ల్లలో పేర్కొన్న ధరకంటే 15 శాతం అధిక ఖర్చు వస్తుందని తేలినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దాంతో కొంతమేర ఎక్సెస్ ఇవ్వాల్సి ఉంటుందన్న అంశం తెర మీదకు రావడంతో ఈ వ్యవహారం రాజకీయ మలుపు తిరిగింది. ఈ నేపథ్యంలో హ్యామ్ టెండర్లలో పేర్కొన్న ధరలు, కాంట్రాక్టర్లు వేసిన అధిక ధర ఎంత, ఇది ఎందుకు చర్చనీయాంశమైంది, ఇతర రాష్ట్రాల్లో ఎంతమేర ఎక్సెస్ ధరలు ఇచ్చారన్న వివరాలతో పాటు ఇక్కడ కాంట్రాక్టర్లకు ఎంత ఎక్కువ ధర ఇవ్వొచ్చనే అంశంపై ఆర్ అండ్ బీ యంత్రాంగం పూర్తి నివేదికను సోమవారం రాష్ట్ర ప్రభుత్వానికి అందించనుంది. దాన్ని పరిశీలించిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే హ్యామ్ అమలు చేసిన బిహర్‌లో 17నుంచి 26 శాతం, గుజరాత్‌లో 17.42 నుంచి 66.46 శాతం, కర్ణాటకలో 14.68 నుంచి 23.60 శాతం, మహారాష్ట్రలో 18 నుంచి 47.74 శాతం, రాజస్థాన్‌లో 13.3శాతం, తమిళనాడులో 44.2 శాతం, భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)లో 50.35 శాతం వరకు గతంలో ఎక్సెస్ రేట్లు ఇచ్చారన్న విషయాన్ని ప్రభుత్వానికి ఇచ్చే నివేదికలో అధికారులు పొందుపర్చారు. హ్యామ్ టెండర్లలో ఓ కంపెనీ 23 శాతం, ఏపీకి చెందిన ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కంపెనీ 14.4 శాతం, హరియాణాకు చెందిన ఓ సంస్థ 15 శాతం చొప్పున ఎక్సెస్ టెండర్లు దాఖలు చేసినట్టు తెలిసింది. కాగా, ఆర్ అండ్ బీ శాఖ పరిధిలో 6,092 కి.మీ, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 7,450 కి.మీ. రోడ్లను హ్యామ్ కింద అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించి ఏడాది అవుతోంది. కానీ ఇప్పటివరకు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తికాకపోవడం గమనార్హం. హ్యామ్ ప్రతిపాదనలు మొదలైనప్పటి నుంచీ ఏదో ఒక అంశంలో అడ్డంకి తగులుతూనే ఉంది. మొదట్లో కాంట్రాక్టర్లు ముందుకురాలేదు. దాంతో ఆర్బీఐ గ్యారెంటీ తీసుకుని బిల్లుల చెల్లింపునకు చర్యలు తీసుకోవడంతో టెండ్లరు దాఖలు చేశారు. తాజాగా ఎక్సెస్ ధరల అంశం రాజకీయ రంగు పులుముకోవడంతో ఆటంకం ఏర్పడింది.