Share News

గురుకులాలకు సర్కారీ వైద్యం

ABN , Publish Date - Jun 25 , 2026 | 04:51 AM

ఏజెన్సీ ప్రాంతాల్లోని గురుకులాలను సమీప ప్రభుత్వ ఆస్పత్రులతో అనుసంధానం చేసి అక్కడి విద్యార్థులకు వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గురుకులాలకు సర్కారీ వైద్యం

  • సమీప ఆస్పత్రులతో అనుసంధానం

  • 20 కిలోమీటర్ల దూరం ఉంటే అత్యవసర రవాణా వ్యవస్థ

  • ఏజెన్సీ ప్రాంత వైద్య సేవలపై వైద్యమంత్రి

హైదరాబాద్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి) : ఏజెన్సీ ప్రాంతాల్లోని గురుకులాలను సమీప ప్రభుత్వ ఆస్పత్రులతో అనుసంధానం చేసి అక్కడి విద్యార్థులకు వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆస్పత్రి నుంచి 20 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న విద్యాసంస్థలకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, అత్యవసర రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నారు. వర్షాకాలం మొదలైన నేపథ్యంలో రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, ఆస్పత్రుల్లో సౌకర్యాలు, వైద్య సేవలు అందించడంలో ఎదురవుతున్న సవాళ్లు తదితర అంశాలపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష జరిపారు. జూబ్లీహిల్స్‌లోని రాజీవ్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, ఏజెన్సీ ప్రాంతాల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని అత్యంత మారుమూల గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందేనని ఆరోగ్యశాఖ అధికారులకు మంత్రి దామోదర్‌ రాజనర్సింహ స్పష్టం చేశారు. వర్షాకాలంలో గిరిజన ప్రాంతాల్లో మలేరియా, డెంగీ, వైరల్‌ జ్వరాలు, డయేరియా వంటి సీజనల్‌ వ్యాధులను నియంత్రించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఇటీవల గుండాల పీహెచ్‌సీలో జరిగిన గర్భిణి మృతి ఘటన నుంచి ప్రతి అధికారి పాఠాలు నేర్చుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. హైరిస్క్‌ గర్భిణులను ముందుగానే గుర్తించి నిరంతర పర్యవేక్షణలో ఉంచాలని ఆదేశించారు. కిడ్నీ రోగులకు ఎమర్జెన్సీ డయాలసిస్‌ సేవల కోసం ఏజెన్సీ ప్రాంతాల్లోని 12 ఆస్పత్రుల్లో అదనంగా 37 డయాలసిస్‌ యంత్రాలను మంజూరు చేస్తున్నామన్నారు.

Updated Date - Jun 25 , 2026 | 04:51 AM