పేద విద్యార్థులకు శక్తి కేంద్రాలు గురుకులాలు
ABN , Publish Date - May 01 , 2026 | 05:25 AM
పేద విద్యార్థులకు గురుకులాలు శక్తి కేంద్రాలుగా నిలుస్తున్నాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థలు పదో తరగతి ఫలితాల్లో ...
కార్పొరేట్‌కు దీటుగా 99.12 శాతం ఉత్తీర్ణత: మంత్రి అడ్లూరి
హైదరాబాద్, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): పేద విద్యార్థులకు గురుకులాలు శక్తి కేంద్రాలుగా నిలుస్తున్నాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థలు పదో తరగతి ఫలితాల్లో 99.12 శాతం ఉత్తీర్ణత సాధించి చరిత్ర సృష్టించాయని పేర్కొన్నారు. మొత్తం 17,071 మంది పరీక్షలకు హాజరుకాగా 16,921 మంది ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఈ ఫలితాలు సాధించడం గురుకులాల విద్యా ప్రమాణాలను మరింత బలపరిచిందన్నారు. గురువారం డీఎస్‌ఎస్ భవన్‌లో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... 235 సంస్థల్లో 163 పాఠశాలలు 100శాతం ఉత్తీర్ణత సాధించాయని, 9 జిల్లాల్లోని అన్ని గురుకులాల్లో 100శాతం ఫలితాలు వచ్చాయని, ఇంటర్‌లోనూ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్ధులు ప్రతిభకనబర్చారని వివరించారు. గురుకులాలను ‘మోడల్ ఎడ్యుకేషన్ క్యాంపసె్‌స’గా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను మంత్రి సన్మానించారు.