గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల
ABN , Publish Date - May 30 , 2026 | 04:20 AM
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలోని సైనిక పాఠశాలలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, నాన్-సీఓఈ, ఒకేషనల్ జూనియర్ కళాశాలలకు సంబంధించి ....
తొలి విడతలో 18,401 మందికి సీట్లు
జూన్ 1 నుంచి తరగతులు
విద్యార్థులు కళాశాలల్లో చేరేందుకు జూన్ 7 తుది గడువు
మారిన గురుకుల పాఠశాలలు, కళాశాలల టైమ్ టేబుల్
హైదరాబాద్: మే 29(ఆంధ్రజ్యోతి): తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలోని సైనిక పాఠశాలలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, నాన్-సీఓఈ, ఒకేషనల్ జూనియర్ కళాశాలలకు సంబంధించి ఇంటర్మీడియట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గురుకుల విద్యాసంస్థల్లో 19,740 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందుకోసం మే 15న నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 39,052 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఫేజ్-1లో 18,401మంది సీట్లు పొందారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 1,339 సీట్లు మిగిలి ఉన్నాయి. జూన్ ఒకటో తేదీ నుంచి ఇంటర్మీడియట్ కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అయితే, ఫేజ్-1లో సీట్లు పొందిన విద్యార్థులు అన్ని రకాల ఒరిజినల్ ధ్రువపత్రాలతో జూన్ 7 లోపు సంబంధిత కళాశాలల్లో చేరాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ సందర్భంగా కోరారు. జూన్ 1 నుంచే కళాశాలలు పున:ప్రారంభం అవుతున్నందున, విద్యార్థులు నష్టపోకుండా మొదటి రోజు నుంచే వారిని కళాశాలలకు పంపాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.
దళిత సంఘాల నేతలలపై కేసులు సరికాదు
మహాత్మా జ్యోతిబా ఫూలే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వంటి మహనీయుల విగ్రహాల ప్రతిష్ఠాపనలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో విగ్రహాల ప్రతిష్ఠాపనలో ఎదురవుతున్న ఇబ్బందులపై సచివాలయంలో శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విగ్రహాల ఏర్పాటుకు సంబంధించి ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, జీహెచ్‌ఎంసీ, పోలీసు శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. అదే సమయంలో అనవసరంగా దళిత సంఘాల నాయకులపై కేసులు నమోదు చేయడం సరికాదని మంత్రి స్పష్టం చేశారు.
గురుకులాల వేళల్లో మార్పు
రాష్ట్రంలోని అన్ని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల వేళలను సవరిస్తూ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శి కంభంపాటి శారద ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు సాగిన విద్యాబోధన వేళలను ఇకపై ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు మార్పు చేశారు. కాగా, గురుకుల విద్యాలయాలకు సరఫరా చేసే వస్తువులు, సేవల నాణ్యతలో ఎలాంటి లోపాలున్నా సదరు కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కంభంపాటి శారద హెచ్చరించారు. కూరగాయలు, చికెన్, మటన్, పాలు, క్యాటరింగ్, స్వీపింగ్, శానిటేషన్, ల్యాబ్ సామగ్రి కాంట్రాక్టులను జిల్లా కొనుగోలు కమిటీ (డీపీసీ) ద్వారా ఖరారు చేయాలని ఆదేశిస్తూ మార్గదర్శకాలు విడుదల చేశారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు టెండర్ ముందస్తు డిపాజిట్ (ఈఎండీ)లో 40శాతం మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు.