గురుకుల డిగ్రీ కాలేజీల్లో ‘ఏఐ’ కోర్సులు
ABN , Publish Date - Jun 12 , 2026 | 05:16 AM
విద్యార్థుల భవిష్యత్తు ఉపాధి అవకాశాలను దృష్టిలో పెట్టుకుని గురుకుల డిగ్రీ కళాశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కోర్సులను ప్రవేశ పెట్టాలని ..
9వ తరగతి నుంచే నీట్, జేఈఈ శిక్షణ
ఉన్నతవిద్య కోసం వెళ్లే ఎస్సీ విద్యార్థులకు ల్యాప్ టాప్‌లు, ఆర్థిక సాయం
టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు
హైదరాబాద్, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల భవిష్యత్తు ఉపాధి అవకాశాలను దృష్టిలో పెట్టుకుని గురుకుల డిగ్రీ కళాశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కోర్సులను ప్రవేశ పెట్టాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్) బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశం నిర్ణయించింది. సచివాలయంలో గురువారం సాంఘిక సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో.. గురుకులాల బలోపేతానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడానికి తొమ్మిదో తరగతి నుంచే ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, ఇందుకోసం మరో 9 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలను ప్రారంభించాలని నిర్ణయించారు. డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు యూజీసీ వేతన స్కేలు అమలుపై సానుకూల నిర్ణయం తీసుకున్నారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే ఎస్సీ విద్యార్థులకు ల్యాప్‌టా్‌పలు, ఆర్థిక సహాయం అందించనున్నారు. డిగ్రీ కళాశాలల నిర్వహణకు ప్రత్యేక పరిపాలనా విభాగం ఏర్పాటుతో పాటు న్యాక్ గుర్తింపు సాధించేందుకు ఓ ప్రత్యేక కమిటీ నియమించనున్నారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న 133 గురుకులాలకు శాశ్వత భవనాలు నిర్మించే విషయమై సీఎం రేవంత్‌రెడ్డితో ప్రత్యేకంగా చర్చించాలని తీర్మానించారు. విద్యార్థులు తల్లిదండ్రులతో మాట్లాడేందుకు వీలుగా ‘‘ఫోన్ మిత్ర’’ సౌకర్యం కల్పించడంతో పాటు అన్ని గురుకులాల్లో ఉమ్మడి మెనూ విధానం అమలు చేయనున్నారు. హైదరాబాద్‌లో ఫార్మసీ కళాశాల స్థాపనకు బోర్డు ఆమోదం తెలిపింది. సామాజికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైను విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి స్పష్టం చేశారు.