గురుకుల టెండర్లకు ‘నిబంధనల’ సెగ
ABN , Publish Date - Apr 23 , 2026 | 04:07 AM
రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థలు, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 19 లక్షల మంది విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు, ఇతర సామగ్రిని సమకూర్చేందుకు ...
24 వస్తువుల సరఫరాకు 27 మంది కాంట్రాక్టర్లే దరఖాస్తు
కఠిన నిబంధనలతో అర్హత కోల్పోయిన పాత సప్లై దారులు
హైదరాబాద్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థలు, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 19 లక్షల మంది విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు, ఇతర సామగ్రిని సమకూర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన సెంట్రలైజ్డ్ టెండర్ల ప్రక్రియ ఆశించిన ఫలితాన్ని ఇవ్వడం లేదు. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ 24 రకాల వస్తువుల సరఫరా కోసం తెలంగాణ సోషల్ వెల్పేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ (టీజీఎస్డబ్ల్యూఆర్‌ఈఐఎస్) టెండర్లు ఆహ్వానించగా, కేవలం 27 మంది కాంట్రాక్టర్లు ముందుకు రావడం గమనార్హం. గతంలో కంటే నిబంధనలు కఠినతరం చేయడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా టర్నోవర్ పమిరిమితిని భారీగా పెంచడం, నోట్ పుస్తకాల తయారీలో వాటర్ మార్క్ పేపర్ వాడాలనే నింబధనలు విధించడంతో రాష్ట్రానికి చెందిన సరఫరాదారులు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులుగా మిగిలిపోయారు. ఈ టెండర్లలో యూనిఫాంలు, స్కూల్ బ్యాగులు, బెడ్డింగ్ మెటీరియల్, స్టేషనరీ కిట్లు, పేట్ల వంటి 24 వస్తువులను 9 కేటగిరీల వారీగా విభజించి దరఖాస్తులు కోరారు. దరఖాస్తు గడువును ఈనెల 13 నుంచి 17 వరకు పెంచినప్పటికీ వ్యాపారుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఉదాహరణకు నోట్ పుస్తకాల సరఫరాకు పుణె, ముంబై, విజయవాడకు చెందిన మూడు కంపెనీలు మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం అధికారులు సాంకేతిక అంశాలను పరిశీలిస్తున్నారు. మరో నాలుగైదు రోజుల్లో ఫైనాన్షియల్ బిడ్లను ఓపెన్ చేసే అవకాశం ఉంది. మరోవైపు దుప్పట్లు, తువ్వాళ్లు, యూనిఫాం వంటి వస్త్రాలను చేనేత సంఘాల నుంచే సేకరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో, వాటి టెండర్ల నిర్వహణలో అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే.