నిరంతర సమీక్షలతోనే ఆదాయ వృద్ధి
ABN , Publish Date - Apr 11 , 2026 | 03:56 AM
రాబడులు వచ్చే శాఖలపై నిరంతర సమీక్షలు, పకడ్బందీగా శాఖల నిర్వహణ, కృత్రిమ మేధ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం..
మూడు నెలలుగా 15 శాతం చొప్పున పెరిగిన జీఎస్‌టీ ఆదాయం
క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో భట్టి విక్రమార్క
హైదరాబాద్, ఏప్రిల్10 (ఆంధ్రజ్యోతి): రాబడులు వచ్చే శాఖలపై నిరంతర సమీక్షలు, పకడ్బందీగా శాఖల నిర్వహణ, కృత్రిమ మేధ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం.. వంటి చర్యల వల్లే రాష్ట్రంలోని వివిధ శాఖల ఆదాయంలో వృద్ధి కనిపిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆర్థిక వనరుల సమీకరణ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం జరిగింది. కమిటీ సభ్యులైన మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. ఏఐ వినియోగంతో మైనింగ్, రవాణా శాఖల్లో ఆదాయ వనరులను పెంచుకోగలిగామని అన్నారు. ఇసుక, క్రషర్ మైనింగ్ విభాగాల్లో అక్రమ రవాణా, ఓవర్ లోడ్ విషయంలో అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. నిరంతర సమీక్షలు, పన్నుల నిర్వహణలో పకడ్బందీ చర్యల వల్లే వాణిజ్య పన్నుల శాఖలో జీఎ్‌సటీ ఆదాయంలో మూడు నెలలుగా 15ు చొప్పున వృద్ధి నమోదవుతూ వస్తుందన్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడమే లక్ష్యంగా రాబడుల శాఖలు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలన్నారు. కాగా, హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో భూముల విక్రయానికి ప్రపంచ స్థాయిలో ప్రచారం కల్పించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. భూముల రిజిస్ట్రేషన్ విలువల పెంపు కోసం ఏర్పాటు చేసిన కమిటీ నివేదికలను ముందుగా తమ సబ్ కమిటీకి సమర్పించాలని, ఆ తర్వాతే మంత్రి మండలికి నివేదించాలని భట్టి విక్రమార్క రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులకు సూచించారు.