Share News

గృహజ్యోతి లబ్ధిదారులకు ఎల్‌నినో షాక్‌

ABN , Publish Date - Jul 17 , 2026 | 05:52 AM

గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపుతోంది. గృహజ్యోతి కింద ఇళ్లలో 200 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించిన లబ్దిదారులకు జీరో బిల్లు వస్తుంది.

గృహజ్యోతి లబ్ధిదారులకు ఎల్‌నినో షాక్‌

  • 200 యూనిట్ల పరిమితి మించి విద్యుత్తు వాడకం

  • జూన్‌లో 4 లక్షల మందికి పథకం దూరం

  • జీరో బిల్లు బదులు పూర్తిగా చెల్లించాల్సిన పరిస్థితి

హనుమకొండ, జూలై16 (ఆంధ్రజ్యోతి): గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపుతోంది. గృహజ్యోతి కింద ఇళ్లలో 200 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించిన లబ్దిదారులకు జీరో బిల్లు వస్తుంది. అంటే వారు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొనడమే కాక ఉష్ణోగ్రతలు తగ్గడం లేదు. వానా కాలంలోనూ ఉక్కపోత కొనసాగుతోంది. దీంతో ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్ల వాడకం వేసవి మాదిరిగానే కొనసాగుతోంది. అలాగే, వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటడంతో.. ఇళ్లలోని మోటార్లు, బోర్లు నడిపే సమయం కూడా పెరిగిపోయింది. దీంతో నెలవారీ విద్యుత్‌ వినియోగం 200 యూనిట్ల పరిమితి దాటుతుంది. దీంతో గృహజ్యోతి లబ్ధిదారులు జీరో బిల్లుకు దూరమవుతున్నారు. ఒక్కసారిగా మొత్తం బిల్లు చెల్లించాల్సి రావడంతో ఆ బిల్లు మొత్తాన్ని చూసి కంగు తింటున్నారు. కొన్ని చోట్ల బిల్లులను చూసి విద్యుత్‌ సిబ్బందితో గొడవలు పడుతున్నారు. ఇలా ఎల్‌నినో దెబ్బకు గృహజ్యోతి పథకానికి దూరమవుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలోని 18 జిల్లాల్లో జూన్‌ నెలలో నాలుగు లక్షల మందికి గృహజ్యోతి పథకం కట్‌ అయింది. ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలో మొత్తం 26.54 లక్షల మంది లబ్ధిదారులు ఉండగా జూన్‌లో 22.59 లక్షల మందికి మాత్రమే జీరో బిల్లులు వచ్చాయి. వీరికి రూ.99.18 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం చెల్లించింది. మార్చి నుంచి జూన్‌ వరకు 6.49 కోట్ల మందికి జీరో బిల్లులు రాగా వీరు రూ.2355 కోట్ల సబ్సిడీ పొందారు. కాగా, ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలో గత మూడు నెలల కాలంలో 5384 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం నమోదైంది.


ఇందులో ఒక్క జూన్‌లోనే 1612.270 మిలియన్‌ యూనిట్ల కరెంట్‌ వాడకమైంది. ఉమ్మడి వరంగల్‌ పరిధిలోని ఆరు జిల్లాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా జూన్‌ నెలలో 385.321 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం నమోదైంది. గతేడాది జూన్‌తో పోలిస్తే ఇది 70 శాతం ఎక్కువ కావడం గమనార్హం. ఎల్‌నినో ప్రభావం వల్ల ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలోని 18 జిల్లాలోనూ విద్యుత్‌ వినియోగం అంశంలో ఇదే పరిస్థితి ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే విద్యుత్‌ వాడకం మరింత పెరుగుతుంది. దీంతో జూలైలో కూడా గృహజ్యోతి లబ్ధి పొందే వారి సంఖ్య తగ్గే అవకాశముంది.

Updated Date - Jul 17 , 2026 | 05:53 AM