Share News

గ్రూప్‌-1 నియామకాలకు హైకోర్టు ఓకే

ABN , Publish Date - Feb 06 , 2026 | 04:18 AM

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన నాటి నుంచి విజయవంతంగా చేపట్టిన మొట్టమొదటి గ్రూప్‌-1 నియామకాలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది.

గ్రూప్‌-1 నియామకాలకు హైకోర్టు ఓకే

  • ఫలితాలు రద్దు చేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టేసిన డివిజన్‌ బెంచ్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన నాటి నుంచి విజయవంతంగా చేపట్టిన మొట్టమొదటి గ్రూప్‌-1 నియామకాలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల ఫలితాలను కొట్టేస్తూ సింగిల్‌ జడ్జి గత ఏడాది సెప్టెంబర్‌ 9న ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ.. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ గురువారం 123 పేజీల తీర్పును వెలువరించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి, టీజీపీఎస్సీకి, ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న విజయవంతమైన అభ్యర్థులకు భారీ ఊరట లభించినట్లయింది. గ్రూప్‌-1 ప్రధాన పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకనంలో లోపాలు, డబుల్‌ హాల్‌టికెట్లు, పరీక్షా కేంద్రాల కేటాయింపు, కొన్ని సెంటర్లలో ఎక్కువమంది ఎంపిక కావడం, ఎంపిక చేసిన అభ్యర్థులను కొన్ని సెంటర్లకు కేటాయించడం, తెలుగు మాధ్యమ అభ్యర్థులపై వివక్ష, ఎవాల్యుయేటర్ల ఎంపికలో లోపాల వంటి కారణాలను చూపుతూ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలను కొట్టేయాలని.. గతంలో హైకోర్టు సింగిల్‌ జడ్జి వద్ద పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన సింగిల్‌ జడ్జి.. తుది మార్కుల జాబితా, జనరల్‌ ర్యాంకుల జాబితాను కొట్టేస్తూ తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు చెల్లదని, తప్పులతడకగా ఉందని పేర్కొంటూ టీజీపీఎస్సీ, ఎంపికైన అభ్యర్థులు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో రిట్‌ అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. టీజీపీఎస్సీ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి, సీనియర్‌ న్యాయవాది ఎస్‌. నిరంజన్‌రెడ్డి, కమిషన్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌ పీఎస్‌ రాజశేఖర్‌, విజయవంతమైన అభ్యర్థుల తరఫున సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. ప్రతివాదుల (రిట్‌ పిటిషనర్లు లేదా విజయవంతంకాని అభ్యర్థుల) తరఫున సీనియర్‌ న్యాయవాదులు రచనారెడ్డి, జి.విద్యాసాగర్‌, సురేందర్‌రావు తదితరులు వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ‘‘పరీక్షల నిర్వహణలో అసమగ్రత, వివక్ష, భారీ లోపాలు, పేపర్‌ లీకేజీ వంటి వ్యవస్థీకృత తప్పిదాలు ఏమైనా ఉన్నాయా? అని చూడాల్సి ఉంటుంది. మాల్‌ప్రాక్టీస్‌ జరిగిందని ఎలాంటి అనుమానాలకూ తావులేని విధంగా నిరూపణ జరగాలి.


సింగిల్‌ జడ్జి మొత్తం పరీక్షలను రద్దు చేసి మళ్లీ పరీక్షలు నిర్వహించాలని లేదా మోడరేషన్‌ పద్ధతిలో రీ-ఎవాల్యుయేషన్‌ చేయాలని తీర్పు ఇచ్చారు. తప్పు జరిగిందని నిర్ధారణకు వచ్చిన తర్వాత రీ-ఎవాల్యుయేషన్‌ చేస్తే మొదటి ఇచ్చిన మొత్తం మెయిన్స్‌ పరీక్షలు రద్దు చేయాలన్న తీర్పు ఎలా అమలవుతుంది? కాబట్టి సింగిల్‌ జడ్జి తీర్పులో లోపం ఉంది. రెండు హాల్‌టికెట్ల జారీ అక్రమమని సింగిల్‌ జడ్జి పేర్కొన్నారు. నోటిఫికేషన్‌ ప్రకారం రెండు హాల్‌టికెట్ల జారీపై ఎలాంటి నిషేధం లేదు. ప్రిలిమినరీ పరీక్షలకు, మెయిన్స్‌ పరీక్షలకు రెండు వేర్వేరు హాల్‌టికెట్‌లు ఇచ్చారు. మెయిన్స్‌ హాల్‌టికెట్‌లపై అభ్యర్థి ప్రిలిమనరీ హాల్‌టికెట్‌ నంబర్‌ కూడా ఉంది. సివిల్‌ జడ్జి, పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు వంటి పరీక్షల్లో సైతం రెండు హాల్‌టికెట్లు ఇచ్చారు. ఇలా ఇవ్వడం వల్ల నష్టం ఏంటి అనేది సింగిల్‌ జడ్జి వివరించలేదు. ర్యాండమైజేషన్‌ పద్ధతి పాటించినప్పుడు 18, 19 సెంటర్లకు కేవలం మహిళలు మాత్రమే ఎలా వచ్చారు? ఆ రెండు సెంటర్లలో పురుషులకు టాయిలెట్స్‌ లేకపోవడం, ఇతర లాజిస్టిక్స్‌ సమస్య ఉన్నందున అక్కడ కేవలం మహిళలను మాత్రమే కేటాయించారు. ఈ మేరకు సాఫ్ట్‌వేర్‌లో మార్పు చేశారు. దీనివల్ల అన్యాయం జరిగినట్లు, ఏకపక్షంగా వ్యవహరించినట్లు కాదు. అందుకు ఆధారాలు లేవు. దివ్యాంగ అభ్యర్థుల సౌకర్యం కోసం సెంటర్ల సంఖ్యను 45 నుంచి 46కు పెంచారు. సెంటర్ల పెంపు కమిషన్‌ విచక్షణపై ఆధారపడి ఉంటుంది. దీనికి దురుద్దేశాన్ని ఎలా ఆపాదిస్తారు? అలాగే మొత్తం అభ్యర్థుల సంఖ్యలో తేడాలు అనే విషయంలో కూడా.. ఆంగ్లంలో అర్హత సాధించని వారి ఫలితాలు నిలిపేయడం వల్ల తేడాలు ఉన్నట్లు కమిషన్‌ స్పష్టమైన వివరణ ఇచ్చింది. సమాధాన పత్రాల మూల్యాంకనంలో మూడో ఎవాల్యుయేషన్‌కు బార్‌ కోడ్‌, బబ్లింగ్‌ లేదనే విషయంలో.. మొదటి, రెండు ఎవాల్యుయేషన్‌లలో 15 శాతానికి పైగా తేడా ఉంటేనే మూడూ ఎవాల్యూయేషన్‌కు వెళ్తుందని కమిషన్‌ వివరణ ఇచ్చింది. ఏ ఒక్క అభ్యర్థికో అనుకూలంగా ఎవాల్యుయేషన్‌ జరిగినట్లు ఎలాంటి ఆధారాలూ లేవు. అభ్యర్థుల మార్కులు ఎవరికి వారివే మాత్రమే కనిపించే విధంగా పబ్లిష్‌ చేయడం వల్ల నష్టం ఏమీ లేదు. మార్కులు తక్కువ వచ్చాయని భావిస్తే రీకౌంటింగ్‌ ఆప్షన్‌ ఉంది. ఎవాల్యుయేటర్ల ఎంపికలో తప్పులు జరిగాయని.. డాక్టర్‌ ఎంఏ మాలిక్‌ అనే ప్రైవేటు ట్యూటర్‌ను తీసుకున్నారనే ఆరోపణలకు కమిషన్‌ సమాధానం ఇచ్చింది.


అతను ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 2010 నుంచి పనిచేస్తున్నారు. అలాగే ఆర్‌సీ రెడ్డి కోచింగ్‌ సెంటర్‌లో తరగతులు బోధించలేదని వివరణ ఇచ్చారు. పరీక్ష పత్రాలు దిద్దే క్రమంలో అభ్యర్థులు ఎవరు అనేది గుర్తించడం సాధ్యం కాదనేది ఇక్కడ ముఖ్య విషయం అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే.. ఆన్సర్‌ కీ అనేది లేదని సింగిల్‌ జడ్జి పేర్కొన్నారు. అయితే ఆన్సర్‌ కీని కమిషన్‌ సీల్డ్‌ కవర్‌లో సమర్పించింది. సుప్రీంకోర్టు ‘సంజయ్‌సింగ్‌’ కేసులో తీర్పు ఇచ్చిన విధంగా మోడరేషన్‌ పద్ధతి పాటించినట్లు కమిషన్‌ ఆధారాలు చూపించింది. ఆర్టికల్‌ 320(3) ప్రకారం పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు విస్తృతమైన అధికారాలు ఉన్నాయి. తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగింది అనడానికి ఎలాంటి డేటా, ఆధారాలు లేవు. 18, 19 సెంటర్లలో సక్సెస్‌ రేట్‌ ఎక్కువ ఉందనడానికి సైతం ఎలాంటి ఆధారం లేదు. 8, 9, 12 సెంటర్లలో సక్సెస్‌ రేట్‌ అంతకంటే ఎక్కువగా ఉంది. కొంతమందిని ఎంపిక చేసుకుని కొన్ని సెంటర్లకు కేటాయించారని వ్యాఖ్యానించడం ద్వారా సింగిల్‌ జడ్జి ధర్మాసనం పొరపాటు పడింది. కేవలం రిట్‌ పిటిషనర్లు (విజయవంతంకాని అభ్యర్థులు) చేసిన ఆరోపణల ఆధారంగా నిర్ధారణకు రావడం సమంజసం కాదు. మాస్‌కాపీయింగ్‌, పేపర్‌ లీకేజీ జరిగినట్లు రిట్‌ పిటిషనర్లు నిరూపించలేకపోయారు’’ అని పేర్కొంది. ఈ మేరకు.. సింగిల్‌ జడ్జి తీర్పును కొట్టివేసి.. టీజీపీఎస్సీ, విజయవంతమైన అభ్యర్థుల అప్పీళ్లను అనుమతిస్తూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తుది తీర్పు ఇచ్చింది.

కుట్రలను ఛేదించి విజయం సాధించాం: సీఎం

గ్రూప్‌-1 నియామకాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును హృదయ పూర్వకంగా స్వాగతిస్తున్నానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఎందరు, ఎన్ని కుట్రలు పన్ని.. ఉద్యోగ నియామకాలను అడ్డుకోవాలని చూసినా వారి కుట్రలు, కుతంత్రాలను ఛేదించి న్యాయ పోరాటంలో విజయం సాధించామని గురువారం ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు. గ్రూప్‌-1కు ఎంపికైన 563 మంది అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి గ్రూప్‌-1 అధికారులుగా నియమితులైన వారు.. ఇక రాష్ట్ర పునర్నిర్మాణానికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.

Updated Date - Feb 06 , 2026 | 04:18 AM