Share News

ఇక ‘గ్రేహౌండ్స్‌’లో సర్దుబాట్లు!

ABN , Publish Date - May 01 , 2026 | 05:47 AM

తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా ప్రకటించిన నేపథ్యంలో గ్రేహౌండ్స్‌ విభాగంలో ప్రక్షాళన ప్రారంభించారు. మావోయిస్టు ఆపరేషన్ల కోసమే ప్రత్యేకంగా...

ఇక ‘గ్రేహౌండ్స్‌’లో సర్దుబాట్లు!

  • ఎస్‌ఐబీకి కూడా కొత్త రూపు

  • తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా ప్రకటించడంతో పోలీసు ఉన్నతాధికారుల చర్యలు

  • సగం సిబ్బంది మాతృ విభాగాలకు..

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా ప్రకటించిన నేపథ్యంలో గ్రేహౌండ్స్‌ విభాగంలో ప్రక్షాళన ప్రారంభించారు. మావోయిస్టు ఆపరేషన్ల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రేహౌండ్స్‌ దళాన్ని పునర్వ్యవస్థీకరించనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నక్సలైట్ల తాకిడి ఎక్కువగా ఉన్న సమయంలో 1989లో ఐపీఎస్‌ అధికారి కేఎస్‌ వ్యాస్‌.. గ్రేహౌండ్స్‌ పేరిట అటాకింగ్‌ కమెండో ఫోర్స్‌ను ప్రారంభించారు. 37 ఏళ్ల గ్రేహౌండ్స్‌ పయనంలో ఎన్నెన్నో విజయాలు, కొన్ని అపజయాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా యాంటీ నక్సల్స్‌ ఆపరేషన్లలో గ్రేహౌండ్స్‌ నంబర్‌ వన్‌ స్థానాన్ని దక్కించుకుంది. నక్సల్స్‌ సమస్యను ఎదుర్కొంటున్న పలు రాష్ట్రాలు అప్పట్లో ఉమ్మడి ఏపీలోని గ్రేహౌండ్స్‌ విభాగంలో తమ పోలీసులకు శిక్షణ ఇప్పించాయి. అనంతర కాలంలో నక్సలైట్లు మావోయిస్టులుగా మారడంతో పాటు హింసాత్మక చర్యలు పెరిగాయి. దీంతో మావోయిస్టులను వేటాడడమే లక్ష్యంగా అధునాతన ఆయుధాలతో కఠినమైన శిక్షణ పొందిన గ్రేహౌండ్స్‌ కమెండోలు రంగంలోకి దిగేవారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ కగార్‌ పేరిట మావోయిస్టు రహిత భారతదేశం కోసం చేసిన ప్రయత్నం ఫలించడంతో మావోయిస్టు ఆపరేషన్ల కోసమే పనిచేసిన గ్రేహౌండ్స్‌, స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఎస్‌ఐబీ)ల్లో ఉన్నతాధికారులు ప్రక్షాళన చర్యలు ప్రారంభించారు. గ్రేహౌండ్స్‌లోని దాదాపు 1700 మంది సిబ్బంది డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారని, వీరిలో సగం మందిని మాతృ విభాగాలకు పంపించనున్నామని డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. గ్రేహౌండ్స్‌ నుంచి వెనక్కి వచ్చిన సిబ్బందిని ఈగల్‌ ఫోర్స్‌, సైబర్‌ సెక్యూరిటీ విభాగాల్లో వినియోగించుకునే అవకాశాలున్నాయని ఆయన వివరించారు. ఎస్‌ఐబీలో పనిచేసిన సిబ్బందిని ఇకపై మత్తుమందుల ముఠాలపై నిఘా కోసం, సైబర్‌ నేరగాళ్లను ట్రాకింగ్‌ చేయడానికి వినియోగించనున్నట్లు తెలిపారు. గ్రేహౌండ్స్‌లోని శిక్షణా విభాగం కొనసాగుతుందని, నిర్వహణ విధుల్లో ఉన్న వారిని ఇతర విభాగాలకు బదిలీ చేస్తున్నామని శివధర్‌రెడ్డి చెప్పారు.

Updated Date - May 01 , 2026 | 05:47 AM