ప్రజాపాలన గ్రామ సభలకు విశేష స్పందన
ABN , Publish Date - Apr 03 , 2026 | 04:54 AM
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలోని 12,758 గ్రామ పంచాయతీలు, 3,175 మునిసిపల్ వార్డుల్లో గురువారం నిర్వహించిన గ్రామ సభలకు విశేష స్పందన లభించింది
సీఎస్, మంత్రులతో పాటు పాల్గొన్న ప్రజా ప్రతినిధులు
హైదరాబాద్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలోని 12,758 గ్రామ పంచాయతీలు, 3,175 మునిసిపల్ వార్డుల్లో గురువారం నిర్వహించిన గ్రామ సభలకు విశేష స్పందన లభించింది. మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా 1,22,983 మంది ప్రజా ప్రతినిధులు, 85,279 మంది అధికారులు ఈ గ్రామ సభల్లో పాల్గొన్నారు. ప్రజా పాలనలో ప్రజల భాగస్వామ్యం పెంపు, ప్రభుత్వ పథకాల అమలుపై చర్చ, లబ్ధిదారుల అభిప్రాయాల సేకరణ, గ్రామ, వార్డు అభివృద్ధి అవసరాల గుర్తింపు, గ్రామ సమస్యల గుర్తింపు, పరిష్కార చర్యలపై చర్చ, పథకాల అమల్లో పారదర్శకత పెంపుపై గ్రామస్థుల సమక్షంలో చర్చించారు.
రవాణా శాఖకు రికార్డు స్థాయిలో ఆదాయం
రాష్ట్ర రవాణా శాఖ 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి ఆదాయం పొందింది. వివిధ లావాదేవీలతో ప్రభుత్వానికి రూ.7,097.38 కోట్లు ఆదాయం సమకూరింది. ఇందులో జీవిత కాలపు పన్నులతో రూ.4,714.63 కోట్లు, త్రైమాసిక పన్నులతో రూ.961.02 కోట్లు, గ్రీన్ ట్యాక్స్‌తో రూ.78.35 కోట్లు, ఫీజులు, సర్వీస్ చార్జీలతో రూ.820.09 కోట్లు, వాహనాల తనిఖీలతో రూ.212.49 కోట్లు, చలాన్లతో రూ.310.80 కోట్లు సమకూరాయి. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో రవాణా శాఖ ఆదాయ లక్ష్యం రూ.8,535 కోట్లు కాగా రూ.7,097.38 కోట్లతో 83.16 శాతం మేర లక్ష్యం సాధించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఆదాయంలో 2.70శాతం వృద్ధి ఉంది.
పన్నుల ఆదాయంలో 5 శాతం పెరుగుదల
పన్నుల ఆదాయంలో వృద్ధి నమోదైంది. గత మార్చి 31వ తేదీతో ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ రూపంలో రూ.44,450 కోట్లు ఖజానాకు జమ అయ్యాయి. అదే 2024-25లో రూ.42443 కోట్లు రాగా... పన్ను రూపంలో 5 శాతం మేర వృద్ధి నమోదైంది. పెట్రోలు, డీజిల్ విక్రయాలతో రూ.16,346 కోట్లు వ్యాట్ వసూలైంది. గతేడాదిలో ఇది రూ.15,800 కోట్లు. దాంతో పెట్రోల్ వ్యాట్‌తో 3 శాతం వృద్ధి రికార్డయింది. లిక్కర్‌పై వ్యాట్ వసూళ్లు రూ.16,942 కోట్లకు చేరాయి. గతేడాది ఇవి రూ.15,998 కోట్లు కాగా...6 శాతం వృద్ధి కనిపించింది. ప్రొఫెషనల్ ట్యాక్స్ రూపంలో రూ.967 కోట్లు సమకూరాయి. గతేడాది రూ.887 కోట్లు కాగా... ఇందులో 9 శాతం అధికంగా వసూలైంది. ఇక నాలుగు రకాల పన్నులు కలిపి రూ.78,706 కోట్లు సమకూరగా... గతేడాదితో రూ.75129 కోట్లతో పోల్చితే 5 శాతం వృద్ధి ఉంది.