Share News

బకాయి నిధుల కోసం పంచాయతీల ఎదురుచూపు

ABN , Publish Date - May 25 , 2026 | 04:59 AM

రాష్ట్రంలోని గ్రామపంచాయతీలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ముఖ్యంగా గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణ, తాగునీటి సరఫరా...

బకాయి నిధుల కోసం పంచాయతీల ఎదురుచూపు

  • కేంద్రం నుంచి రూ.729.41 కోట్లు రావాలి

హైదరాబాద్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గ్రామపంచాయతీలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ముఖ్యంగా గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులు వంటి ప్రాథమిక సేవలను కొనసాగించడంలో పంచాయతీలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. కొంతకాలంగా పాలకవర్గాల్లేని కారణంగా గ్రామ పంచాయతీలకు నిలిచిపోయిన 15వ ఆర్థిక సంఘం బకాయి నిధుల్లో అధికశాతం కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేసింది. మిగిలిన బకాయి నిధులు ఏప్రిల్‌ నెలాఖరుకు వస్తాయని సంబంధిత విభాగాలు భావించినప్పటికీ.. కేంద్రం నుంచి అవి రాకపోవడంతో పంచాయతీలకు ఎదురుచూపులు తప్పడంలేదు. పంచాయతీలకు రావాల్సిన రూ.3,023.15 కోట్ల నిఽధుల్లో.. విడతల వారిగా మార్చి నెలాఖరు వరకు కేంద్ర ఆర్థిక శాఖ మొత్తం రూ.2,293.74 కోట్ల నిధును విడుదల చేసింది. మరో రూ.729.41కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 12,760 గ్రామ పంచాయతీలకు గాను బకాయి నిధులను పిబ్రవరి 5న రూ.259.36కోట్లు, 12న రూ.387కోట్లు 20న రూ.387.53 కోట్లు, మార్చి 13న రూ.640 కోట్లు, 31న రూ.619.85 కోట్ల నిధులను కేంద్రం జమచేసింది. కేంద్ర ఆర్థికశాఖ విడుదలచేసిన నిధులకు సంబంధించి యూసీలను (నిధుల వినియోగ బిల్లులను) పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు ఇప్పటికే సమర్పించారు. ఈ మేరకు మిగిలిన ఆ కొద్దిపాటి బకాయిలను ఇవ్వకపోవడంతో గ్రామాల్లో అభివృద్థి, నిర్వహణ పనులపై ప్రభావం చూపుతోంది.

నిధుల వినియోగంపై కొత్త సమస్య!

కేంద్రం పంచాయతీలకు బకాయిల విడుదల ఊరట కల్పించినప్పటికీ.. రెండేళ్ల తర్వాత విడుదలైన ఈ నిధుల వినియోగంపై పాత, కొత్త సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల మధ్య వివాదం కొనసాగుతోంది. విడుదలైన నిధులను పాత బిల్లుల చెల్లింపులకు కూడా వాడాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే కొత్త సర్పంచులు నిధులను పాత పనులకు కాకుండా కొత్త పనులకే కేటాయిస్తామని పట్టుబడుతుండటంతో కొత్త సమస్య వచ్చిపడింది. అయితే కొన్నిచోట్ల మాత్రం సమస్యలేకుండా బకాయి నిదులను చెల్లించారు. మరికొన్ని చోట్ల ఎంబీ రికార్డులు లేకపోవడం, ఇతర కారణాల వల్ల పాత సర్పంచులకు బకాయి చెల్లింపుల్లో ఆటంకం ఏర్పడుతోంది.

Updated Date - May 25 , 2026 | 04:59 AM